హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడంతో పాటు భారీగా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే పటిష్టమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన రోడ్ కనెక్టివిటీ కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం ఆయన ఉన్నతాధికారుల బృందంతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు.
ఇందులో భాగంగా ముందుగా ప్రముఖ డేటా సెంటర్ సంస్థ ‘కంట్రోల్స్’ , అలాగే ‘వెల్స్పన్’ పరిశ్రమలను స్వయంగా సందర్శించి, ఆయా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం, రోజువారీ కార్యకలాపాలు, పారిశ్రామిక అవసరాలు, అందుబాటులో ఉన్న తాగునీరు, విద్యుత్ వంటి వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక ప్రతినిధులు తమ భవిష్యత్ అవసరాలను, విస్తరణ ప్రణాళికలను వివరించగా, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎస్ హామీ ఇచ్చారు. పరిశ్రమల సందర్శన అనంతరం హైతాబాద్ పరిధిలో శరవేగంగా సాగుతున్న రేడియల్ రోడ్డు నిర్మాణ పనులను సీఎస్ సంజయ్ జాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
