- నవంబర్ 14 లోగా స్టాల్స్ఏర్పాటుకు దరఖాస్తులు
- ఈసారి 320 స్టాళ్ల ఏర్పాటు
- పుస్తక ప్రదర్శన లోగో ఆవిష్కరణ..
బషీర్‌బాగ్, వెలుగు : డిసెంబర్ 18 నుంచి 28వ తేదీ వరకు ఇందిరాపార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుక్ ఫెయిర్ లోగోను బుక్ ఫెయిర్ సలహా కమిటీ సభ్యులు, సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్ రామా మెల్కోటే, కార్యవర్గ సభ్యుడు, కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీలోగా పుస్తక స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేస్తామన్నారు.
ఈసారి సుమారు 320 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంగణానికి ప్రముఖ ఉర్దూ రచయిత్రి జీలానీ బానో పేరు పెట్టినట్లు తెలిపారు. సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి, పుస్తకావిష్కరణల వేదికకు దళిత హక్కుల కార్యకర్త, రచయిత డాక్టర్ వై.బి. సత్యనారాయణ పేర్లను నిర్ణయించినట్లు చెప్పారు. ఇతర వేదికలకు సదానంద శారద, ఏటుకూరి ప్రసాద్, రైటర్స్ స్టాల్స్‌కు తెలిదేవర భానుమూర్తి పేర్లు ఖరారు చేశామన్నారు. బాలల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) సహకారంతో చేపట్టనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీకి ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, ట్రెజరర్ కె. సురేష్, సంయుక్త కార్యదర్శి రజని, కార్యవర్గ సభ్యురాలు సజయ పాల్గొన్నారు.
