పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట నిరసన.. మహిళా ఏసీపీ మానస్వి వశిష్ట సస్పెండ్!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట నిరసన.. మహిళా ఏసీపీ మానస్వి వశిష్ట సస్పెండ్!

ఢిల్లీలో పోలీస్ శాఖలోనే నిరసన సెగ మొదలైంది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్  ఎదుట ఆందోళనకు నాయకత్వం వహించిన మహిళా ఏసీపీ మానస్వి వశిష్టపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ కమిషనర్‌ను కలవాలని డిమాండ్ చేస్తూ ఆమెతో పాటు పలువురు పోలీస్ అధికారులు నిరసనకు దిగడం ఈ ఘటనకు కారణమైంది.

అసలు వివాదం ఏంటి?
తూర్పు ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో ఇటీవల పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వివాదం జరిగింది. న్యాయవాది లలిత్ బన్సల్‌పై దాడి జరిగిన కేసును పోలీసులు సరిగా నిర్వహించడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగారు.

ఈ క్రమంలో గాంధీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న మానస్వి వశిష్టతో పాటు షాదారా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అరుణ్ కుమార్‌ను అధికారులు బదిలీ చేశారు.

పోలీస్ హెడ్‌క్వార్టర్స్  ఎదుట  నిరసన
 బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏసీపీ మానస్వి వశిష్టతో పాటు పలువురు పోలీస్ అధికారులు సోమవారం ఢిల్లీలోని జై సింగ్ రోడ్డులో ఉన్న పోలీస్ హెడ్‌క్వార్టర్స్   ఎదుట గుమిగూడారు.

పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌ను నేరుగా కలిసి మా  సమస్యలను వివరించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు మానస్వి వశిష్ట నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా  డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని, పోలీస్ కమిషనర్‌ను కలిసి మాట్లాడాలని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు.

ALSO READ : ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు..దీపావళి నేపథ్యంలో 2 రోజులు సుప్రీంకోర్టు అనుమతి

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనే దానిపై పోలీస్ శాఖలో ఒక నిర్దిష్ట విధానం (SOP) ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. "పోలీసులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక నగర ప్రజలకు రక్షణ కల్పించడానికి మేము ఎలా పోరాడగలం?" అని ఆమె ప్రశ్నించారు. నిరసన సమయంలో అధికారులు 'భారత్ మాతా కీ జై', 'పోలీస్ ఏక్తా జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.

నిరసన తర్వాత ఏసీపీపై సస్పెన్షన్ వేటు
పోలీస్ హెడ్‌క్వార్టర్స్  ఎదుట జరిగిన నిరసనకు నాయకత్వం వహించిన ఏసీపీ మానస్వి వశిష్టను అధికారులు సస్పెండ్ చేశారు. న్యాయవాదులతో వివాదం, పోలీస్ అధికారుల బదిలీలు, ఆ తర్వాత జరిగిన నిరసనతో ఢిల్లీ పోలీస్ శాఖలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.