ఆసియాలో నెం.1గా అంబానీ.. బైట్ డ్యాన్స్ జాంగ్ యిమింగ్‌ను వెనక్కి నెట్టిన రిలయన్స్ అధినేత

ఆసియాలో నెం.1గా అంబానీ.. బైట్ డ్యాన్స్ జాంగ్ యిమింగ్‌ను వెనక్కి నెట్టిన రిలయన్స్ అధినేత

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొత్త రికార్డ్ సృష్టించారు. బైట్‌డ్యాన్స్ సహ-వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్‌ను వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర సంపద 10.5 శాతం పెరిగి ఏకంగా రూ. 8లక్షల 43వేల 600 కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అంబానీ 22వ స్థానంలో నిలవగా.. రూ. 7లక్షల 98వేల కోట్ల సంపదతో జాంగ్ యిమింగ్ 25వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ. 7లక్షల 60వేల 950 కోట్ల సంపదతో 26వ స్థానంలో కొనసాగుతున్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో దాదాపు 12 శాతం మేర లాభపడి అంబానీ సంపద ఒక్కసారిగా పెరిగింది. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువకు సుమారు రూ. లక్షా 80వేల 500 కోట్లకు పైగా అదనంగా చేరింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేయడమే ఈ షేర్ల దూసుకుపోవడానికి ప్రధాన కారణం. 

►ALSO READ | 27 ఏళ్ల భారతీయ యువకుడికి సిస్కోలో కీలక బాధ్యతలు.. రెండేళ్లలో 98 శాతం పాత కోడ్ మార్చే ఛాన్స్!

ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత రాబడి 28 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో రూ. 3.62 లక్షల కోట్లకు చేరగా, EBITDA 24 శాతం పెరిగి రూ. 62వేల 409 కోట్లకు తాకింది. ఇక అంచనాలను మించి నికర లాభం 34 శాతం దూసుకెళ్లి రూ.29వేల 550 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా O2C వ్యాపారం అత్యుత్తమ పనితీరు కనబరిచింది. వీటికి తోడు అక్టోబర్ 28న అంబానీ జియో ప్లాట్‌ఫారమ్స్ షేర్లు 27 శాతం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించడంతో రిలయన్స్ గ్రూప్ దూకుడు మరింత పెరిగింది.

1957లో ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ స్థాపించబడిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.17 లక్షల 54వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ముఖేష్ అంబానీ డిజిటల్, టెలికాం విభాగమైన జియో ప్లాట్‌ఫారమ్స్ జూన్ నాటికి 53 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో దేశంలోనే అతిపెద్ద మొబైల్ క్యారియర్‌గా మారింది.