ముంబై: నటి దియా మీర్జా నటించిన కాలుష్య రహిత దీపావళి ప్రచార వీడియోను తొలగించడంపై బాంబే హైకోర్టు ఫైర్ అయ్యింది. కొందరు రాజకీయ నాయకుల అభ్యంతరాల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం దీయా మీర్జా నటించిన వీడియోను తొలగించడం సరికాదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీరుపై మండిపడింది. పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించిన ప్రచారానికి కొందరు రాజకీయ నాయకులు మతపరమైన రంగు పులమడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ చురకలంటించింది. దియా మీర్జా నటించిన కాలుష్య రహిత దీపావళి ప్రచార వీడియోను వెంటనే తమ సోషల్ మీడియా ఖాతాల్లో రీ అప్లోడ్ చేయాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..?
దీపావళి పండుగ వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేయడానికి, బహిరంగ వీధుల్లో టపాసులు కాల్చకుండా పర్యావరణహిత దీపావళిని జరుపుకునేలా ప్రచారం చేయాలని బాంబే హైకోర్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పలువురు సెలబ్రెటీలతో బీఎంసీ ఒక అవగాహన వీడియోను రూపొందించింది. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా కాలుష్య రహితంగా దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతూ ఒక వీడియో చేశారు.
ఈ వీడియోను బీఎంసీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. అయితే, దీయా మీర్జా వీడియోపై ముంబై బీజేపీ చీఫ్ అమిత్ సతమ్, ఇతరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దియా మీర్జా ఒక హిందూ వ్యతిరేకి అని.. అలాంటి వ్యక్తి దీపావళి పండుగ ఎలా జరుపుకోవాలో మాకు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దియా మీర్జా వీడియోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో దియా మీర్జా వీడియోను బీఎంసీ తొలగించింది.
►ALSO READ | Ramayana: రిలీజ్‌కు ముందే ‘రామాయణ’కు పైరసీ సెగ.. రంగంలోకి బాంబే హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ!
రాజకీయ ఒత్తిళ్లతో దియా మీర్జా వీడియోను తొలగించడంతో కొందరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దియా మీర్జా ప్రచార వీడియోను తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ గిరీష్ కుల్కర్ణి, జస్టిస్ డాక్టర్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశాన్ని పూర్తిగా పర్యావరణ కోణంలో మాత్రమే చూడాలని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యం కోసం చేసిన ప్రచారానికి మతం రంగు పులమడంతో పరోక్షంగా బీజేపీ నేతలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం, నమ్మకాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పీల్చేది ఒకే గాలి అనే బీజేపీ నాయకులకు చురకలంటించింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన ముంబై నగరంలో సహజీవన సమతుల్యతను కాపాడటానికి తొలగించిన దియా మీర్జా వీడియోను వెంటనే తిరిగి బీఎంసీ సోషల్ మీడియా ఖాతాలలో రీ అప్లోడ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
