హారర్ సినిమాలంటే కేవలం దెయ్యాలు, అరుపులు, రక్తపాతమే కాదు.. మనిషిలోని భయాన్ని కూడా తెరపై ఆవిష్కరించగలగాలి. అలాంటి ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హిందీ హారర్ థ్రిల్లర్ ‘ఝాద్ ఫూంక్’. మూఢనమ్మకాలు, చేతబడులు, తాంత్రిక విద్యల చుట్టూ అల్లుకున్న ఈ కథలో ఓ గర్భిణి పడే భయంకరమైన పరిస్థితులను కళ్ళకు కట్టడం సినిమాలోని మెయిన్ అట్ట్రాక్ట్ చేసే విషయం. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా నిజంగానే వెన్నులో వణుకు పుట్టించిందా? లేక అక్కడక్కడా భయపెట్టి సరిపెట్టిందా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
చివరి వరకు ఉత్కంఠ రేపే స్టోరీ బ్యాక్‌డ్రాప్
సినిమా టైటిల్ ‘ఝాద్ ఫూంక్’ (Jhaad Phoonk). ‘ఝాద్-ఫూంక్’ అంటే తెలుగులో చేతబడి, తంత్ర విద్యలు అని అర్థం. ఇక ఈ టైటిల్ వినగానే చేతబడులు, క్షుద్రపూజలు, తాంత్రిక విద్యలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. అయితే దర్శకుడు ఈ అంశాలను కేవలం భయపెట్టే సన్నివేశాల కోసం ఉపయోగించకుండా.. ఓ గర్భిణి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కథను అల్లుకున్నారు. తెలియని ప్రదేశం, అపరిచిత వ్యక్తులు, నమ్మలేని పరిస్థితులు.. ఈ మూడింటి మధ్య చిక్కుకున్న ఓ మహిళ ప్రయాణమే ఈ సినిమా.
కథేంటంటే:
ఆస్థ (సుంబుల్ తౌకీర్ ఖాన్) గర్భిణి. తన ప్రియుడు, భర్త రాజ్వీర్ (హర్ష్ రాజ్‌పుత్)తో కలిసి ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల మీదుగా ఢిల్లీకి బయలుదేరుతుంది. ఇద్దరి మధ్య పెళ్లి విషయమై చిన్నపాటి మనస్పర్థలు కూడా ఉంటాయి. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఓ మహిళ వారి కారుకు అడ్డుగా రావడంతో ఊహించని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం తర్వాత ఆస్థ కళ్లు తెరిచేసరికి ఓ అపరిచిత ఇంట్లో ఉంటుంది. అక్కడ మోహన్ ఠాకూర్ (యశ్పాల్ శర్మ), ఆయన భార్య కామిని ఠాకూర్ (పద్మిని కొల్హాపురే) ఆమెకు ఆశ్రయం కల్పిస్తారు. మొదట్లో వారి ఆతిథ్యం ఆస్థకు కొంత ఊరటనిస్తుంది. కానీ తనతో వచ్చిన రాజ్వీర్ కనిపించకపోవడం, ప్రమాదం గురించి వారు చెబుతున్న విషయాలు ఆమెను అయోమయానికి గురిచేస్తాయి. అక్కడి నుంచి అసలు భయం మొదలవుతుంది. ఆ ఇంట్లో వినిపించే వింత శబ్దాలు, కనిపించని అడుగుల చప్పుళ్లు, అర్థంకాని సంఘటనలు ఆస్థను క్రమంగా భయాందోళనలకు గురిచేస్తాయి. మరోవైపు తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటం ఆమెను మరింత కలవరపెడుతుంది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆస్థకు ఎదురవుతున్నవి నిజంగానే అతీంద్రియ శక్తులా? లేక ఎవరో పన్నిన భయంకరమైన పన్నాగమా? ఆమెకు ఆశ్రయం ఇచ్చిన దంపతుల అసలు ఉద్దేశం ఏమిటి? ఆస్థకు తోడుగా ఉండే చిన్నపిల్లవాడు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
సినిమా ఎలా ఉందంటే:
హారర్ సినిమాకు మొదటి పదిహేను నిమిషాలే చాలా కీలకం. ప్రేక్షకుడిలో ఆసక్తి, భయం రెండింటినీ ఒకేసారి రేకెత్తించగలిగితే సినిమా సగం విజయం సాధించినట్లే. ‘ఝాద్ ఫూంక్’ ఈ విషయంలో మంచి ఆరంభాన్ని అందిస్తుంది. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల నేపథ్యం, ప్రమాదం తర్వాత మారిపోయే పరిస్థితులు, అపరిచిత ఇంటి వాతావరణం కథపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఒకే ఇంటి పరిసరాల్లో కథను నడిపించడం వల్ల పాత్రల మధ్య అనుమానాలు, భయాలు మరింత బలంగా కనిపిస్తాయి. ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? అనే సందిగ్ధత ప్రేక్షకుడికి కూడా కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో వచ్చే ఆకస్మిక భయపెట్టే షాట్లు, నిశ్శబ్దాన్ని పంచే విజువల్స్ కట్టిపడేస్తాయి.
►ALSO READ | Ramayana: రిలీజ్‌కు ముందే ‘రామాయణ’కు పైరసీ సెగ.. రంగంలోకి బాంబే హైకోర్టు
అయితే సినిమా ప్రారంభంలో ఉన్న ఉత్కంఠను చివరి వరకు అదే స్థాయిలో కొనసాగించడంలో మాత్రం కొంత తడబడింది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనం కొంత నెమ్మదిస్తుంది. అయినప్పటికీ మనలో ఉండే అనుమానం.. వచ్చే ట్విస్టులు ఉత్కంఠరేపుతోంది. క్లైమాక్స్ మరింత బలంగా ఉండటంతో సినిమా స్థాయి పెరుగుతుంది...మొత్తంగా భయం, ఉత్కంఠ, మిస్టరీ కలగలిసిన హారర్ థ్రిల్లర్‌గా ‘ఝాద్ ఫూంక్’ ఆకట్టుకుంటుంది.
నటీనటుల నటన ఎలా ఉంది?
ఈ సినిమాకు నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రధాన బలం. సుంబుల్ తౌకీర్ ఖాన్ గర్భిణి ఆస్థ పాత్రలో భయం, ఆందోళన, అభద్రతాభావాన్ని సహజంగా పలికించారు. యశ్పాల్ శర్మ మోహన్ ఠాకూర్‌గా తనదైన నటనతో భయాన్ని పెంచారు. పద్మిని కొల్హాపురే తన రహస్యమైన హావభావాలతో ఆకట్టుకోగా, హర్ష్ రాజ్‌పుత్ పరిమిత స్క్రీన్ స్పేస్‌లోనూ మెప్పించారు.
టెక్నికల్ అంశాలు..
హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే పనిచేశాయి. చీకటి వాతావరణం, సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని సన్నివేశాల్లో భయాన్ని పెంచుతాయి. అయితే ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. విజువల్ ఎఫెక్ట్స్‌లోనూ కొన్ని లోపాలు కనిపిస్తాయి.
