మహారాష్ట్రలో FDA భారీ దాడులు.. పట్టుబడిన కల్తీ నెయ్యిలో పతంజలి బ్రాండ్ ఆవు నెయ్యి..

మహారాష్ట్రలో FDA భారీ దాడులు.. పట్టుబడిన కల్తీ నెయ్యిలో పతంజలి బ్రాండ్ ఆవు నెయ్యి..

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన సంస్థ (FDA ) రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో పతంజలి ఆవు నెయ్యితో పాటు భారీ మొత్తంలో ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 114 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, సుమారు రూ.9.01 కోట్ల విలువైన 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశారు.

పతంజలి నెయ్యి కూడా స్వాధీనం
ఛత్రపతి సంభాజీనగర్‌లోని పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ 'మెస్సర్స్ దివ్య మహావితారక్' నుంచి రూ.20.20 లక్షల విలువైన పతంజలి ఆవు నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,279.7 లీటర్ల నెయ్యిని సీజ్ చేసినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. తప్పుడు లేబులింగ్, కల్తీ అనుమానాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. స్వాధీనం చేసుకున్న నెయ్యి నిల్వలు ప్రాథమికంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

19 సంస్థల లైసెన్సులు రద్దు
ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించకపోవడం, సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం, కీటకాల నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే శుభ్రతకు సంబంధించిన రికార్డులు, అవసరమైన డాకుమెంట్స్ నిర్వహించకపోవడం, ఆహార భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ముంబై, అమరావతి, ఛత్రపతి సంభాజీనగర్ ప్రాంతాల్లోని 19 ఆహార వ్యాపార సంస్థల లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. వీటిలో నమ్కీన్, స్వీట్లు, మసాలా దినుసులు తయారు చేసే యూనిట్లు కూడా ఉన్నాయి.

భారీగా వంట నూనె, బియ్యం స్వాధీనం
ఈ తనిఖీల్లో భాగంగా థానే జిల్లాలోని భివండిలో ఉన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ నుంచి 1,44,218 కిలోల వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. సతారాలోని అమీన్ ట్రేడర్స్ నుంచి 20,560 కిలోల బియ్యం, పప్పులు, బెల్లం, ఇతర ఆహార పదార్థాలను సీజ్ చేశారు. పూణే డివిజన్ పరిధిలోని సతారాలో స్వాతి ఆయిల్ మిల్స్, సోలాపూర్‌లో ఎస్జీ ట్రేడర్స్ నుంచి కూడా వంట నూనెను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

17 సంస్థలపై కేసులు.. 16 మంది అరెస్ట్
అక్టోబర్ 28 నుంచి 31 వరకు జరిగిన మరో తనిఖీ కార్యక్రమంలో 17 సంస్థల నుంచి రూ.79.40 లక్షల విలువైన నిషేధిత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో  13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 16 మందిని అరెస్ట్ చేశారు. ఏడు సంస్థలను సీజ్ చేయడంతో పాటు ఆరు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్, నాగ్‌పూర్ ప్రాంతాల్లోని 34 హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన లోపాలు గుర్తించి 29 మెరుగుదల నోటీసులు జారీ చేశారు.

టాటా 1ఎంజీకి కూడా నోటీసులు
మరోవైపు టాటా 1ఎంజీ మెరైన్ కొల్లాజెన్ పౌడర్‌కు సంబంధించిన లేబులింగ్, ప్రకటనల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  టాటా 1ఎంజీ హెల్త్‌కేర్ సొల్యూషన్స్, ఏసీఎఫ్‌ఓ ఫార్మాస్యూటికల్స్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్ ఇండియాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ సంస్థలను ఆదేశించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.