రాయచోటి పోలీస్ స్టేషన్ ముందు గంజాయి బ్యాచ్‌లోని ఓ కుర్రాడు నానా రచ్చ చేశాడు. ప్రశ్నించిన పోలీసులపై తిరగబడి.. మత్తులో పోలీస్ జీప్‌ను పదే పదే కొడుతూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. లంచం ఎందుకు అడిగావని, క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కానిస్టేబుల్‌ను నిలదీశాడు. అంతేకాదు.. ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబులా ఫీలయి పోయి ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని పోలీస్ జీప్ పైకెక్కి చేసిన రచ్చ అంతాఇంతా కాదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలో గంజాయి మత్తులో కొందరు యువత ఇలా ఒళ్లు మరిచి ప్రవర్తిస్తుండటంపై ఆందోళన నెలకొంది. అసలు ఇలాంటి వీళ్లకు ఇంత సులువుగా గంజాయి దొరకడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కాకుండా సోంపు ప్యాకెట్ల సైజులో అమ్మకాలు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్లు తెప్పించి సేల్స్ చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
గంజాయి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్, చరాస్ పేస్ట్ కూడా అమ్ముతున్నారు. అయితే వీటికి అలవాటుపడిన వారు ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి తాగుతున్నారు. రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనం ఉండరు కాబట్టి ఆ ప్రాంతాలను ఎన్నుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని హోటళ్లలో ఏర్పాటు చేసిన స్మోకింగ్జోన్స్లోనూ గంజాయి కూర్చిన సిగరెట్లను యువత పీలుస్తున్నట్టు తెలుస్తోంది.
