విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం..పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ 

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం..పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ 

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాకా గ్రోత్ ఫౌండేషన్ (KGF) ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు,పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తమ వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని  అన్నారు. 

బిజినెస్​ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి ఈ ఫౌండేషన్​ ద్వారా ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం KGF వెబ్‌సైట్‌లో వారి ఆలోచనలను నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అందించే ప్రతిపాదనల్లో మంచి ఆలోచనలను ఎంపిక చేసి, వాటిని పరిశీలించేందుకు తమ టీం నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్తుందని చెప్పారు. ఎంపికైన మంచి బిజినెస్ ఐడియాలకు రూ.5 లక్షల వరకు పారితోషికం అందించనున్నట్లు తెలిపారు. 

మంగళవారం (నవంబర్​3) బాగ్​ లింగంపల్లిలోని అంబేద్కర్​ కాలేజీలో బిజినెస్​ ప్లాన్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వ్యాపార ఆలోచనలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. దాదాపు 25 విద్యార్థుల బృందాలు ఈ ఈవెంట్‌లో పాల్గొని తమ బిజినెస్ ప్లాన్లను  వివరించాయని చెప్పారు. 

KGF ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, వారి ఆలోచనలను వ్యాపారాలుగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించడమే ప్రధాన ఉద్దేశమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు.