గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ వేళల్లో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్(NSEIX) నవంబర్ 2, 2026 నుంచి దాదాపు రౌండ్-ది-క్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. దీంతో గిఫ్ట్ నిఫ్టీ ఉదయం ట్రేడింగ్ సెషన్ సమయాన్ని గంటా పదిహేను నిమిషాలు ముందుగానే ప్రారంభించేలా పొడిగించారు. ఫలితంగా ఇప్పుడు ఉదయం సెషన్ సమయం 6:30 గంటలకు బదులుగా 5:15 గంటలకే ప్రారంభమౌతోంది.
ఈ తాజా మార్పులతో గిఫ్ట్ నిఫ్టీ మొత్తం ఆపరేటింగ్ విండో రోజుకు 23 గంటల 30 నిమిషాలకు పెరిగింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం ప్రీ-ఓపెన్ సెషన్ ఉదయం 5:00 గంటలకే మొదలవుతుండగా.. సాధారణ ట్రేడింగ్ ఉదయం 5:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే మధ్యాహ్నం 3:40 గంటలకు ప్రీ-క్లోజ్ ప్రారంభమై.. ఆర్డర్ కలెక్షన్ 3:50 గంటలకు ముగుస్తుంది. ఇక రెండో సెషన్ వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో సెషన్ ప్రీ-ఓపెన్ మధ్యాహ్నం 3:58 గంటలకు ప్రారంభమై.. సాధారణ ట్రేడింగ్ సాయంత్రం 4:05 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2:45 గంటల వరకు యథావిధిగా సాగుతుంది.
ఈ కొత్త ట్రేడింగ్ టైమింగ్స్ ద్వారా మన దేశీయ మార్కెట్లు ప్రారంభమయ్యే ముందే రాత్రిపూట అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకునే పరిణామాలపై ఇన్వెస్టర్లు తక్షణమే స్పందించే వీలుంటుంది. బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 సూచీ ఓపెనింగ్ ట్రెండ్‌ను ముందుగానే అంచనా వేసేందుకు గిఫ్ట్ నిఫ్టీని ట్రేడర్లు అత్యంత కీలకంగా భావిస్తారు. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్ల సమయాలను కవర్ చేసేలా ఈ 23.5 గంటల ట్రేడింగ్ విధానాన్ని తీసుకువచ్చినట్లు ఎన్ఎస్ఈఐఎక్స్ వెల్లడించింది.
గిఫ్ట్ సిటీని ప్రపంచ స్థాయి ఆర్థిక వేదికగా తీర్చిదిద్దడంలో ఈ పొడిగించిన ట్రేడింగ్ టైమింగ్స్ ఒక మైలురాయిగా నిలుస్తాయని ఎన్ఎస్ఈఐఎక్స్ ఎండీ, సీఈవో వి. బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడంతో పాటు గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానాన్ని ఇది మరింత బలపరుస్తుందని ఆయన తెలిపారు. సెషన్ల మధ్య కేవలం 3 నిమిషాల్లోనే, అలాగే రోజు ముగింపులో 15 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే టెక్నాలజీ అప్డేట్స్ పూర్తి చేసుకునేలా మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది.
