బాలీవుడ్ తుషార్ కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్!

బాలీవుడ్ తుషార్ కపూర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్!

బాలీవుడ్‌ను వరుస బెదిరింపులు, కాల్పుల ఘటనలు వణికిస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి బాలీవుడ్ నటుడు, నిర్మాత ఏక్తా కపూర్ సోదరుడు తుషార్ కపూర్‌ను టార్గెట్ చేసినట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఏకంగా రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో ఓ వ్యక్తి తుషార్ కపూర్‌కు ఫోన్ చేశాడు. రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన తుషార్ వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ కేసును యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్, క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

అయితే ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరింపు కాల్‌కు సంబంధించిన ఆడియోను పోలీసులు పరిశీలించి, హ్యారీ బాక్సర్‌కు చెందిన అధికారిక వాయిస్ శాంపిళ్లతో పోల్చి చూశారు. కానీ రెండింటికీ సరిపోలిక కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ఉపయోగించుకుని ఎవరో నకిలీ బెదిరింపులకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఇదిలా ఉంటే, అక్టోబర్ 18న ముంబైలోని జుహూలో టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డ్రైవర్, ఓ వ్లాగర్ గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఇప్పటివరకు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, హర్యానాలోని కర్నాల్‌లో మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు కూడా నిందితులుగా ఉన్నారు. అక్టోబర్ 27న నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA)ను ప్రయోగించారు.

మరి తుషార్ కపూర్‌కు వచ్చిన కాల్ వెనుక నిజంగా ఎవరు ఉన్నారు? బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో భయపెడుతున్నది ఎవరు? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.