రూ.600లకే వెయ్యి కిమీ ప్రయాణం: ఈవీలకు రాత్రిపూట యూనిట్ కరెంట్ రూ.3కే ఇవ్వాలి: గడ్కరీ

రూ.600లకే వెయ్యి కిమీ ప్రయాణం: ఈవీలకు రాత్రిపూట యూనిట్ కరెంట్ రూ.3కే ఇవ్వాలి: గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించే దిశగా కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ముంబైలో జరిగిన 'KPMG ENRich 2026' సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల రంగానికి ఊతమిచ్చేలా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక వినూత్న సూచన చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పగటిపూట సోలార్ పవర్‌ను ఉపయోగించుకుంటూ.. రాత్రి సమయాల్లో విద్యుత్ ఛార్జీలను భారీగా తగ్గించాలని కోరారు. రాత్రి పూట విద్యుత్ యూనిట్ ధర రూ.3గా, పగటిపూట రూ.5గా విధిస్తే ఈవీల ఛార్జింగ్ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో పాల్గొన్న వారిని ఉద్దేశించి గడ్కరీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ఆసక్తికరమైన అంచనా వేశారు. సదస్సుకు హాజరైన వారిలో సుమారు 20-25 శాతం మంది ఈవీలను ఉపయోగిస్తున్నట్లు చేతులెత్తి చూపారని.. రాబోయే సంవత్సరంలో ఈ సంఖ్య ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరుగుతుందని చెప్పారు. 

ఈవీల నిర్వహణ ఖర్చు పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎంత తక్కువగా ఉంటుందో గడ్కరీ లెక్కలతో సహా వివరించారు. యూనిట్‌కు రూ.3 విద్యుత్ ఛార్జీ, కిలోవాట్‌కు 5 కిమీ మైలేజ్ అంచనా ప్రకారం.. ఎలక్ట్రిక్ కారులో 1,000 కిలోమీటర్లు ప్రయాణించడానికి కేవలం 200 యూనిట్ల విద్యుత్ సరిపోతుందన్నారు. దీనికయ్యే ఖర్చు కేవలం రూ.600 మాత్రమే అంటూ లెక్కలు చెప్పారు. అదే దూరం ప్రయాణించడానికి 15 కిమీ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్ అయితే ముంబైలో సుమారు రూ.7వేల414 ఖర్చవుతుంది. అలాగే డీజిల్ కారుకు సుమారు రూ. 6వేల522 ఖర్చవుతుంది. 

ఇంధన భద్రతను పెంపొందించే క్రమంలో బ్యాటరీల ధరలు కూడా తగ్గుతున్నాయని గడ్కరీ తెలిపారు. గతంలో కిలోవాట్-అవర్‌కు సుమారు 150 డాలర్లుగా ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీల ధరలు ప్రస్తుతం 50 డాలర్లకు తగ్గాయని వెల్లడించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ తయారీ వేగవంతమైందని చెప్పారు. భారత్‌లో ఏటా దాదాపు 6వేల ఎలక్ట్రిక్ బస్సులు తయారవుతుండగా.. రాబోయే రెండేళ్లలో 10వేల బస్సుల అవసరం ఉంటుందని అంచనా వేశారు. వోల్వో, అశోక్ లేలాండ్, మెర్సిడెస్ బెంజ్, టాటా వంటి ప్రముఖ సంస్థలతో పాటు ముంబైలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ALSO READ : డబుల్ ఇంజిన్ సర్కార్‌కు డబుల్ ఓటమి

ట్రక్కులు, ఇతర భారీ రవాణా వాహనాల కోసం హైడ్రోజన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. హైడ్రోజన్‌తో నడిచే 3 టాటా ట్రక్కుల తయారీ జరుగుతోందని.. త్వరలోనే హైడ్రోజన్ రూట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.