వ్యవసాయంపై ఎల్‌నినో ఎఫెక్ట్: నీళ్లు లేక 46 శాతం పడిపోయిన రబీ సాగు

వ్యవసాయంపై ఎల్‌నినో ఎఫెక్ట్: నీళ్లు లేక 46 శాతం పడిపోయిన రబీ సాగు

దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్‌నినో భూతం కమ్మేసింది. ఎన్నడూ లేనివిధంగా ఉరుముల్లేని పిడుగులా  ముంచుకొచ్చిన ప్రకృతి విలయం.. అన్నదాతల వెన్నువిరుస్తోంది. అక్టోబర్ 30 నాటికి అందిన అధికారిక లెక్కలు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. శీతాకాల రబీ సీజన్ ప్రారంభంలోనే పంటల సాగు దాదాపు సగానికి పడిపోయింది దేశవ్యాప్తంగా. దేశంలో అన్నంపెట్టే పొలాలు బోసిపోయి కనిపిస్తుండటంతో.. రాబోయే రోజుల్లో తీవ్ర ఆహార కొరత, ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ ఏడాది దేశ వ్యవసాయ వృద్ధి రేటు సున్నాకి పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ వ్యవసాయ నిపుణుడు అశోక్ గులాటి హెచ్చరించిందే నిజమయ్యేలా కనిపిస్తోంది. 

రబీ సీజన్ రియల్ లెక్కలు:

1. మొత్తం రబీ సాగు: గతేడాది ఇదే సమయానికి 69 లక్షల హెక్టార్లలో సాగు జరగగా.. ఈ ఏడాది అది కేవలం 37.6 లక్షల హెక్టార్లకు పడిపోయి, 45.6 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది.

2. గోధుమలు: దేశ ప్రజల ప్రధాన ఆహారమైన గోధుమ సాగు ఏకంగా 94.3 శాతం కుప్పకూలింది. గతేడాది 3.3 లక్షల హెక్టార్లలో సాగుకాగా.. ఇప్పుడు కేవలం 19 వేల హెక్టార్లకే పరిమితమైంది.

3. నూనెగింజలు: వంటనూనెల కొరతకు దారితీసేలా.. నూనెగింజల సాగు 45.7 శాతం తగ్గి 38.6 లక్షల నుంచి 21 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ముఖ్యంగా రాప్ సీడ్ & ఆవాల సాగు 46.2 శాతం తగ్గి 20.5 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.

4. పప్పుధాన్యాలు: పప్పుల సాగు 51.7 శాతం పడిపోయి 19.6 లక్షల నుంచి 9.5 లక్షల హెక్టార్లకు దిగజారింది. ఇందులో శనగలు 58.9 శాతం తగ్గి 5.9 లక్షల హెక్టార్లకు, ఎర్ర కందిపప్పు 48.6 శాతం తగ్గి 1.1 లక్షల హెక్టార్లకు సాగు పడిపోయి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇవి పరోక్షంగా విదేశాల నుంచి అధిక దిగుమతులకు దారితీసి రేట్ల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.

5. ఇతర పంటలు: ముతక ధాన్యాల సాగు 10.4 శాతం తగ్గి 3.8 లక్షల హెక్టార్లకు, వరి సాగు 4 శాతం తగ్గి 3.2 లక్షల హెక్టార్లకు పడిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులు ఇప్పటికే ఎల్ నినో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో రుచిచూపిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా జనానికి.

ALSO READ : ఒకే పంటపై ఆధారపడొద్దు.. సమీకృత వ్యవసాయంతో  ప్రతిరోజూ ఆదాయం

ఈ పరిస్థితికి అసలు కారణం ఏమిటి?
ఈ విలయానికి ప్రధాన కారణం ప్రకృతి వైపరీత్యాలే. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ తర్వాత అక్టోబర్ 1 నుంచి 28 మధ్య కాలంలో కురవాల్సిన వర్షాలు ఏ0కంగా 48 శాతం లోటును నమోదు చేశాయి. దీనికి తోడు జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటిపోయాయి. చారిత్రక సగటుతో పోలిస్తే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 18.6 శాతం తక్కువగా ఉండటంతో.. విత్తనాలు వేసినా నీరందక రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. 'సూపర్ ఎల్‌నినో' ప్రభావం ఇలాగే కొనసాగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఈ పరిస్థితులు ప్రజలను రోజువారీ తిండి ఖర్చులు పెరిగేలా చేసి ఆర్థికంగా దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.