చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు అనుసంధానిత రుణాల రూపంలో రూ.3 వేల కోట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మొత్తం సాయంలో ఈరోడ్ జిల్లాలోని 9 వేల మందికి పైగా మహిళా సంఘాల సభ్యులకు రూ.1,110 కోట్ల రుణాలు అందించారు. పెరుందురైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.
రుణాల పంపిణీకి ముందు సీఎం విజయ్ మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను సందర్శించారు. పలు జిల్లాలకు చెందిన మహిళలు రూపొందించిన సంప్రదాయ బొమ్మలు, వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, వెదురు వస్తువులను పరిశీలించారు. నీలగిరి జిల్లాకు చెందిన పాల్మలర్ సంఘం ప్రదర్శించిన సంప్రదాయ టోడా గిరిజన ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, నెయ్యి, తాటి ఆకులతో రూపొందించిన అలంకరణ వస్తువులు, అరటి నారతో తయారు చేసిన పర్యావరణహిత ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి తయారీ నైపుణ్యాలను అభినందించారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలు నిర్వహించిన క్యాటరింగ్ స్టాళ్లలో టీ తాగిన విజయ్.. అందుకు స్వయంగా డబ్బులు చెల్లించారు. తన రూపంలో చెక్కతో రూపొందించిన శిల్పంతో పాటు అరటి నారతో తయారు చేసిన వస్తువును కూడా కొనుగోలు చేశారు.
