టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా జరిగిన ప్రమాదంలో ఆయన కుడి భుజానికి గాయం అయ్యింది. దీంతో వెంటనే నితిన్ ను హైదరాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ ఆందోళన మొదలైంది.
వైద్యులు నితిన్‌కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం నితిన్ నార్నే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆసుపత్రి యాజమాన్యం కీలక విజ్ఞప్తి చేసింది. నితిన్ కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని, ఎలాంటి నిరాధారమైన వార్తలు, వదంతులు ప్రచారం చేయవద్దని కోరింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆసుపత్రికి రావద్దని కూడా విజ్ఞప్తి చేసింది.
►ALSO READ | Allu Arjun: ఇది సినిమా కాదు మన సంస్కృతి, మన గర్వం.. రణబీర్ కపూర్ 'రామాయణ' టీమ్ కు బన్నీ బెస్ట్ విషెస్!
ఇక నార్నే నితిన్ కెరీర్ విషయానికి వస్తే.. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కామెడీ టైమింగ్, నటనతో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్న ఆయన త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
