నీళ్లు లేవు.. సెలవులిచ్చేశాం.. ఇళ్లకెళ్లిపోండి.. మాదాపూర్ నారాయణ హాస్టల్ క్యాంపస్

నీళ్లు లేవు.. సెలవులిచ్చేశాం.. ఇళ్లకెళ్లిపోండి.. మాదాపూర్ నారాయణ హాస్టల్ క్యాంపస్

హైదరాబాద్: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని నారాయణ ఐఐటీ అకాడమీ నీటి కొరత కారణంగా విద్యార్థులకు సెలవులిచ్చేసింది. జూనియర్, సీనియర్ విద్యార్థులకు దీపావళి వరకూ సెలవులు ఇస్తున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే.. దీపావళి వరకూ ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజ్ యాజమాన్యం స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు మొదలయ్యాయి. నీళ్లు రాకపోవడంతో హాస్టల్ నిర్వహకులు  ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల బంద్తో నీటి సప్లై లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. ఐటీ కారిడార్లోని శేరిలింగంపల్లి జోన్ డీసీపీతో ఈ సమస్య గురించి చెప్పేందుకు హాస్టల్ నిర్వాహకులు వెళ్లారు.

హైదరాబాద్ సిటీ రోడ్లపై వేల లీటర్ల నీళ్లు నేలపాలయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైడ్రా, రెవెన్యూ అధికారుల చర్యలకు నిరసనగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు మంగళవారం పలుచోట్ల బంద్ పాటించారు. బంద్లో పాల్గొనకుండా రోడ్లపైకి వచ్చిన ట్యాంకర్లలోని నీటిని రోడ్లపై పారబోశారు.

తాగునీటితో బండ్లు కడిగినా, ఫ్లోర్లు శుభ్రం చేసినా జరిమానాలు వేస్తున్న జలమండలి, నీళ్లు తరలించేటప్పుడు ట్యాంకర్ లీకైనా నవంబర్ 1 నుంచి రూ.5 వేల ఫైన్ విధిస్తోంది. నీటి వృథాను అరికట్టేందుకు ‘పానీ’ యాప్ ద్వారా ప్రజల నుంచే ఫిర్యాదులు తీసుకుంటోంది.

ఇలాంటి సమయంలోనే ట్యాంకర్ల యజమానులు ఉద్దేశపూర్వకంగా నీటిని రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. ఇతర ప్రైవేట్ ట్యాంకర్లు రోడ్లపైకి రాకుండా యజమానులు అడ్డుకున్నారు. తమ సంఘం పిలుపు మేరకు అందరూ బంద్ పాటించాలని, ప్రైవేట్ ట్యాంకర్లేవీ రోడ్లపైకి రావొద్దని సూచించారు. అధికారుల చర్యలతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సిటీలో చెరువుల దగ్గర అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా అధికారులు కొద్ది రోజులుగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో తమ బోర్లను కూడా అక్రమ బోర్లుగా చూపి తొలగిస్తున్నారని ట్యాంకర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.