క్రైస్తవ మహిళలపై దాడి ఘటన.. ఇరువర్గాల ఆందోళన.. ‘జై శ్రీరామ్’, ‘జై జీసస్’ నినాదాలతో ఉద్రిక్తత

క్రైస్తవ మహిళలపై దాడి ఘటన.. ఇరువర్గాల ఆందోళన.. ‘జై శ్రీరామ్’, ‘జై జీసస్’ నినాదాలతో ఉద్రిక్తత

హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలోని మారుతీనగర్‌లో ఇద్దరు క్రైస్తవ మహిళలపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండు నెలల క్రితం బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్న మహిళలపై కొందరు వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

క్రైస్తవులకు సంబంధించిన వారు, హిందువులు పరస్పరం ‘జై జీసస్’, ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కసారిగా భారీగా జనాలు గుమిగూడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీర్‌ పేట్ పోలీసులు రంగంలోకి దిగి, లాఠీలతో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.