మురసు తుఫాన్ తీరం దాటింది.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

మురసు తుఫాన్ తీరం దాటింది.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

మురసు తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఈ రోజు(మంగళవారం నవంబర్​3) తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. 

తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

మురసు తుఫాన్ తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం  ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. 

గంటకు 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రేపు కూడా వర్షాలు.. 

రేపు (బుధవారం )భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అయితే ఎల్లుండి నుంచి మురసు తుఫాన్ ప్రభావం తగ్గడంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి.