ఏపీలో కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. 13 కార్పొరేషన్లలోనూ కూటమి అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు, మూడు మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో ఉండగా.. మిగతా అన్ని చోట్ల వెనకబడి ఉంది.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి పార్టీల జోరు లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచే మెుదలైంది. మెజార్టీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు దూసుకుపోతుండటంతో ట్రెండ్ ఏకపక్షంగా మారుతోంది. మొత్తం 13 కార్పొరేషన్లలోనూ కూటమి మేయర్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఇక మున్సిపాలిటీల వారీగా చూస్తే.. టీడీపీ 44, జనసేన 15, బీజేపీ 3 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నాయి. ఇక వైసీపీ కేవలం కొన్ని చోట్ల మాత్రమే తన ప్రభావం చూపుతోంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఊరటనిచ్చే ఫలితాలను సాధిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ తన పట్టు నిరూపించుకుంది. ఇక్కడ మొత్తం 32 వార్డులకు గాను వైసీపీ ఏకంగా 22 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టీడీపీ 8 వార్డుల్లో విజయం సాధించింది. మొదట పోస్టల్ బ్యాలెట్లలో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించిన టీడీపీ.. ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ కాగానే వెనుకబడింది. దీంతో నందికొట్కూరు చైర్మన్ పీఠం వైసీపీ ఖాతాలో పడటం దాదాపు ఖాయమైంది.
ALSO READ : చీరాల మున్సిపల్ ఓట్ల లెక్కింపు వాయిదా.. నవంబర్ 6న కౌంటింగ్
మరోవైపు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం డోన్‌లో టీడీపీ 5, వైసీపీ 4 వార్డుల్లో లీడ్‌లో ఉన్నాయి. అలాగే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పిట్ల రామతులసి ఆధిక్యంలో కొనసాగుతూ గట్టి పోటీ ఇస్తున్నారు.
విజయవాడ, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఆలస్యం కావడంతో ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ సాయంత్రానికి పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్నికల బరిలో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల వైసీపీ ధీటైన పోరాటం చేస్తుండటం గమనార్హం. సో మెుత్తం రిజల్ట్స్ కోసం సాయంత్రం వరకూ వేచిచూడాల్సిందే.
