పది రూపాయల వడ్డీకి తెచ్చి పంచాను.. నా డబ్బులు నాకు ఇచ్చేయండి.. ఓడిన వైసీపీ అభ్యర్థి ఆవేదన

పది రూపాయల వడ్డీకి తెచ్చి పంచాను.. నా డబ్బులు నాకు ఇచ్చేయండి.. ఓడిన వైసీపీ అభ్యర్థి ఆవేదన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఓడిపోయిన అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పలమనేరులో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 32వ వార్డులో జనసేన అభ్యర్థి పూలా చైతన్య చేతిలో ఓడిన  ప్రసాద్ రెడ్డి అప్పు చేసి డబ్బులు పంచానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మోసం చేసిన ఓటర్లను మారెమ్మ తల్లి వదలదని, ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టాడు.

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి పోటీ చేశాడు. జనసేన అభ్యర్థి పూలా చైతన్య చేతిలో ఓడిపోయాడు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు అభ్యర్థి స్వయంగా ఒప్పుకోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఓటర్లకు డబ్బులు ఇచ్చానని, అయినప్పటికీ తనను ఓడించారని ప్రసాద్ రెడ్డి మండిపడ్డాడు.

ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు పంపిణీ చేయడం చట్టవిరుద్ధం. అలాంటిది అభ్యర్థి స్వయంగా డబ్బు పంచానని, తిరిగి తన డబ్బు తనకు ఇవ్వాలని వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల సంఘం అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.