హైదరాబాద్: నీటి వృథాను అరికట్టడంతో పాటు నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు హైదరాబాద్ జలమండలి చేపట్టిన PAANI యాప్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 437 మంది వాటర్ వారియర్లుగా నమోదు చేసుకున్నారు. ప్రతి పౌరుడిని నీటి సంరక్షణలో భాగస్వామిని చేయాలనే లక్ష్యంతో జలమండలి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
PAANI యాప్ ద్వారా తాగునీటి వృథా, దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను ప్రజలు నేరుగా జలమండలికి తెలియజేయవచ్చు. తాగునీటితో వాహనాలు, ఇళ్ల ముందు ఫ్లోర్లు కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, పైప్‌లైన్లలో లీకేజీలు వంటి సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో PAANI యాప్ అందుబాటులో ఉంది. అలాగే జలమండలి వెబ్‌సైట్ ద్వారా కూడా వాటర్ వారియర్లుగా నమోదు చేసుకోవచ్చు.
యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నీటి దుర్వినియోగం జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదులు చేసిన వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని జలమండలి స్పష్టం చేసింది.
రాబోయే ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జలమండలి నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి కుటుంబం తమ రోజువారీ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని పిలుపునిచ్చింది. అవసరానికి మించి నీటిని వినియోగించకుండా, ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడాలని సూచించింది.
ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వాటర్ వారియర్లుగా ముందుకు రావాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. నీటి వృథాను గుర్తించడం, అధికారులకు సమాచారం అందించడం ద్వారా నీటి సంరక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరింది.
నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని జలమండలి పేర్కొంటోంది. ప్రజల భాగస్వామ్యంతో నీటి వృథాను అరికట్టి, నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చడమే లక్ష్యంగా PAANI కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ వాటర్ వారియర్‌గా మారి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలని జలమండలి పిలుపునిస్తోంది.
