Nagarjuna Vs Tabu: ఈసారి ప్రేమ కాదు.. యుద్ధమే.. నాగార్జునతో టబు ఢీ.. 'కింగ్ 100'లో అసలైన ట్విస్ట్ ఇదేనా?

Nagarjuna Vs Tabu: ఈసారి ప్రేమ కాదు.. యుద్ధమే.. నాగార్జునతో టబు ఢీ.. 'కింగ్ 100'లో అసలైన ట్విస్ట్ ఇదేనా?

అక్కినేని అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం 'కింగ్ 100' నుంచి మరో ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ హీరోయిన్ టబుకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను నవంబర్ 4న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టబు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

 దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మళ్లీ కలిసి తెరపై కనిపించబోతున్నారు. గతంలో ఈ జంట తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఈసారి మాత్రం ప్రేమకథతో కాకుండా ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగబోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా టబు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో  'బ్యాక్ విత్ ద కింగ్ ఆఫ్టర్ ఏజెస్.. అండ్ ఇట్ ఈజ్ వార్ దిస్ టైమ్' అంటూ ఆసక్తిని పెంచారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి పోరు ఉండబోతోందనే చర్చ మొదలైంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tabu (@tabutiful)

కోలీవుడ్ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల అనుబంధంతో పాటు ఓ వ్యక్తి పేదరికం నుంచి సంపన్నుడిగా ఎదిగే ప్రయాణం ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు సమాచారం. సుష్మిత భట్, విజయేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన తొలి గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు టబు పాత్రకు సంబంధించిన వీడియోతో మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నాగార్జున 100వ సినిమా కావడం, టబుతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.