అమెరికాలో తట్టు (మీజిల్స్) మళ్లీ కలకలం రేపుతోంది. తట్టు సోకిన చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ గ్రామీణ ప్రాంతాల్లో తట్టు వ్యాధి విజృంభిస్తుండటం, ఓ చిన్నారి మృతి చెందడం అమెరికన్లతో ఆందోళన కలిగిస్తోంది. గత ముప్పైఏళ్లలో తట్టుతో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అమెరికా వ్యాప్తంగా తట్టు కేసులు పెరుగుతుండటంతో అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
లూయిస్ కౌంటీలో చిన్నారి..
న్యూయార్క్‌లోని గ్రామీణ ప్రాంతమైన లూయిస్ కౌంటీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తట్టు వ్యాధి సోకిన చిన్నారి చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే లూయీస్ కౌంటీలో నమోదైన మీజిల్స్ కేసుల్లో బాధితులు తట్టు నివారణ టీకా (MMR) తీసుకోలేదని ఆరోగ్య రికార్డులు చెబుతున్నాయి.
న్యూయార్క్‌లో 178 కేసులు
రాష్ట్రవ్యాప్తంగా తట్టు కేసులు పెరుగుతుండటంతో న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ స్టేట్ డిజాస్టర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 178 కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
అమెరికా వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
2026లో అమెరికా అంతటా మీజిల్స్ కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 4వేల800కు పైగా కేసులు నమోదైనట్లు అయ్యాయి. ఒకప్పుడు తట్టు వ్యాధి నిర్మూలన దశకు చేరుకున్న అమెరికాలో మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
టీకాలపై నిపుణుల ఆందోళన
తట్టు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో MMR టీకా కీలక పాత్ర పోషిస్తుంది. చిన్నారులకు టీకాలు వేయించే రేటు 95 శాతం కంటే తగ్గితే వ్యాధి వ్యాప్తి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో లోటు ఉండటం వల్లే మీజిల్స్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తట్టు వ్యాధి అత్యంత వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా చిన్నారుల్లో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల నిర్ణీత షెడ్యూల్ ప్రకారం MMR టీకాలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
