హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 7.60 లక్షల LED వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.1,720.83 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఈ ప్రాజెక్టుకు రూ.1,341 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా మరో రూ.379 కోట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టును BAC Infratech – Vinci Global జాయింట్ వెంచర్‌కు ఖరారు చేసింది. ఈ రెండు సంస్థలు 74:26 నిష్పత్తిలో భాగస్వాములుగా ఉన్నాయి.
పదేళ్ల నిర్వహణకు రూ.1,401కోట్లు
మూడు కార్పొరేషన్ల పరిధిలోని వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను పదేళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఒక్కో స్ట్రీట్ లైట్ నిర్వహణకు నెలకు రూ.153 చొప్పున చెల్లించనున్నారు. పదేళ్ల నిర్వహణ వ్యయంగా రూ.1,401 కోట్లు, అదనంగా GST రూపంలో రూ.252 కోట్లు కేటాయించారు. థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఏజెన్సీ కోసం మరో రూ.31.50 కోట్లను కేటాయించారు.
ఉస్మానియా యూనివర్సిటీకి పర్యవేక్షణ బాధ్యతలు
వీధి దీపాల నిర్వహణ పనుల నాణ్యత, పనితీరు, మరమ్మతులపై పర్యవేక్షణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. నిర్వహణలో లోపాలు తలెత్తితే జరిమానాలు విధించేందుకు అవసరమైన పనితీరు అంచనాలను కూడా OU చేపట్టనుంది. వీధి దీపాలు పనిచేయకపోతే తక్షణమే మరమ్మతులు చేపట్టేలా ఒప్పందంలో నిబంధనలు పొందుపరిచారు.
మూడు కార్పొరేషన్ల పరిధిలో దీపాల వివరాలు
- GHMC: 3,30,487 వీధి దీపాలు.. రూ.747.72 కోట్ల వ్యయం
- CMC (సైబరాబాద్): 1,85,258 వీధి దీపాలు.. రూ.419.16 కోట్ల వ్యయం
- MMC (మల్కాజిగిరి): 2,44,846 వీధి దీపాలు.. రూ.553.95 కోట్ల వ్యయం
ఈ మూడు కార్పొరేషన్లకు GHMCని నోడల్ ఏజెన్సీగా నియమించారు. మూడు కార్పొరేషన్లతో విడివిడిగా ఒప్పందాలు చేసుకోనున్నారు. వీధి దీపాలతో పాటు CCMS ప్యానెల్స్, వాటికి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ కూడా ఈ కాంట్రాక్టులో భాగంగా ఉంటుంది.
