ఆదాయానికి మించిన ఆస్తులు.. మెప్మా అడిషనల్ డైరెక్టర్పై ఏసీబీ కేసు

 ఆదాయానికి మించిన ఆస్తులు.. మెప్మా అడిషనల్ డైరెక్టర్పై ఏసీబీ కేసు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో మెప్మా అడిషనల్ డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 2026 నవంబర్ 3న (మంగళవారం) హైదరాబాద్‌తో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు చెప్పారు. ఉప్పల్‌ హైకోర్టు కాలనీలో 334 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+3 భవనం విలువను రికార్డుల ప్రకారం రూ.2.50 కోట్లుగా అంచనా వేశారు. ఇంటీరియర్‌ డెకరేషన్‌, ఇతర పరికరాల విలువ మరో రూ.20 లక్షలుగా గుర్తించారు.

హబ్సిగూడ, పెద్ద అంబర్‌పేట, మేడిపల్లి, గాంధీనగర్‌, సూర్యాపేట ప్రాంతాల్లో ఓపెన్‌ ప్లాట్లు, ఇతర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే 50 లక్షల రూపాయల విలువైన టయోటా ఫార్చ్యూనర్‌, 21 లక్షల రూపాయల మహీంద్రా థార్‌ కార్లతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు, 2.5 కిలోల బంగారం, మూడు కిలోల వెండిని గుర్తించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ 4 కోట్ల రూపాయలకు పైగా ఉందని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని డీఎస్పీ తెలిపారు. యాదగిరి రావు కుమారుడి పెట్టుబడులకు సంబంధించిన రబ్బరు ఫ్యాక్టరీ, ట్రాన్స్‌మిషన్‌ ఇండస్ట్రీస్‌ వివరాలపైనా ఆరా తీస్తున్నారు. 

తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తిస్థాయి తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. యాదగిరి రావును కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.