హైదరాబాద్, నవంబర్ 3: రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి, చేపలు, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు.
మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం 113వ ఎపిసోడ్‌లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన మాజీ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సీహెచ్. నవీన్ కుమార్ తన విజయగాథను వివరించారు. సైన్యంలో సేవలందించిన అనంతరం ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయలతో పాటు పాడి పశువులు, నాటు కోళ్లు, చేపల పెంపకం, మునగ, నేపియర్ గడ్డి, బంతిపూల సాగు చేపడుతున్నారు. వర్మీ కంపోస్టు, వర్మీవాష్ తయారీతో పాటు బయో రిసోర్స్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.
నవీన్ కుమార్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇతర రైతులు కూడా సమీకృత వ్యవసాయ విధానాలను అనుసరించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో యాసంగి సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరమని సూచించారు. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మురసు తుఫాను నేపథ్యంలో పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. పురుగుమందుల వినియోగంలో రక్షణ చర్యలు పాటించాలని, రైతులకు భద్రతా కిట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సాగు పద్ధతులు, నీటి లభ్యత, పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించారు.
