అస్తవ్యస్తంగా పడేసిన బూట్లు, చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, సగం ఎండిన రక్తపు మరకలు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఈ తరగతి గదిలోకి 21 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి, 15 ఏళ్ల 10వ తరగతి బాలికపై దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మరో విద్యార్థి కూడా గాయపడింది. అక్టోబర్ 31న జరిగిన ఈ దాడి.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అయితే నేరస్థలం కావడంతో తరగతి గదిని మూసి ఉంచారు. కానీ ఇక్కడ జరిగిన ఘోరానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. నేల మీద చిందిన రక్తం, హడావిడిగా వదిలేసిన వస్తువులు, దాడి దృశ్యాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు చూసిన దానికి ఒక భయంకరమైన జ్ఞాపకంగా నిలుస్తున్నాయి.
తరగతి గదిలోకి చైన్సాతో వచ్చి దాడి
అక్టోబర్ 31న ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో స్కూల్లో క్లాసులు జరుగుతున్నాయి. అదే సమయంలో హేమంత్ అలియాస్ డుమ్ము అనే 21 ఏళ్ల యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో పదో తరగతి గదిలోకి వచ్చాడు. అక్కడ ఉన్న గోపిక అనే విద్యార్థినిపై దాడి చేశాడు.
ఈ దాడిలో గోపిక ముఖం, మెడ, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుడి చేయి కూడా దాదాపు తెగిపోయేంత తీవ్రంగా గాయపడింది. తన స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థిని కూడా గాయపడింది. దాడి చేసిన తరువాత హేమంత్ ఎలక్ట్రిక్ రంపంను అక్కడే వదిలేసి స్కూల్ నుంచి పారిపోయాడు.
భయంతో స్కూల్ రావడం మానేసిన విద్యార్థులు
ఈ ఘటన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయానికి గురయ్యారు. నవంబర్ 2న స్కూల్ తిరిగి తెరిచినప్పటికీ, చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు. దాదాపు ఐదుగురు విద్యార్థులు మాత్రమే స్కూల్ హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు.
గతంలో ఎలాంటి భద్రత లేని స్కూల్ గేటు వద్ద ఇప్పుడు ముగ్గురు వ్యక్తులను కాపలాగా ఉంచారు. స్కూల్లోకి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు, గుర్తింపు కార్డును చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దాడి జరిగిన తరగతి గదిని మూసివేశారు.
ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చినా విద్యార్థుల్లో భయం
స్కూల్‌కు వచ్చిన కొద్దిమంది విద్యార్థులకు ఆత్మరక్షణకు సంబంధించిన కొన్ని పద్ధతులను శిక్షకులు వివరించారు. ఎవరైనా దాడి చేయడానికి వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలి ? శరీరంలోని కొన్ని ఒత్తిడి పాయింట్లను ఉపయోగించి దాడి చేసేవారిని ఎలా అడ్డుకోవాలి? అనే విషయాలను ప్రదర్శించి చూపించారు. అయితే ఈ శిక్షణ చూసిన విద్యార్థులకు పెద్దగా నమ్మకం కలగలేదు. వారిలో ఒక విద్యార్థి అడిగిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది.
"దాడి చేసే వ్యక్తి చేతిలో ఎలక్ట్రిక్ రంపం ఉంటే.. అతని చేతిని నేను ఎలా తాకగలను?" అని ఆ విద్యార్థి ప్రశ్నించాడు. ఆ విద్యార్థి అడిగిన ప్రశ్నలోనే వారి భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆత్మరక్షణ పద్ధతులు ఎంతవరకు ఉపయోగపడతాయనే సందేహం విద్యార్థుల్లో కనిపిస్తోంది.
పిల్లలను తిరిగి స్కూలుకు పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు
ఈ ఘటన తర్వాత కొంతమంది స్వచ్ఛంద సేవకులు, శిక్షణ పొందిన వ్యక్తులు స్కూలుని సందర్శించారు. విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించడంతో పాటు, ఈ ఘటన నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మరోవైపు స్కూలు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఖాళీగా కనిపిస్తున్న తరగతి గదులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
గాయపడిన విద్యార్థిని లక్ష్మి తండ్రి నాగబాబు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి పూర్తిగా చక్కబడే వరకు స్కూల్ మూసి ఉంచాలని కోరారు.
పోలీసుల కాల్పుల్లో నిందితుడికి తీవ్ర గాయాలు
మరోవైపు స్కూల్లో దాడి చేసిన హేమంత్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే అతను పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, ఓ పోలీస్ ఇన్స్పెక్టర్పై కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు అనంతపురం ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. దీంతో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో గోపికకు చికిత్స
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒక విద్యార్థిని జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఈ ఘటనతో స్కూల్ భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు భద్రత కల్పించడంతో పాటు, వారిలో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
