ఆక్లాండ్: భారత్‌తో రేపటి (2026, నవంబర్ 4, బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) తమ బౌలర్లను హెచ్చరించాడు. భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బౌలింగ్ చేసేటప్పుడు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (2026, నవంబర్ 3, మంగళవారం) జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శాంట్నర్ కివీస్ బౌలింగ్ వ్యూహాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
షార్ట్ బాల్స్‌ని కూడా సిక్సర్లు కొడుతున్నాడు:
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిలో వచ్చిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ సీమ్‌కు అనుకూలించినా లేదా ఫ్లాట్‌గా ఉన్నా.. రోహిత్, విరాట్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లపై నిరంతరం ఒత్తిడి పెంచడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇప్పుడు షార్ట్ పిచ్ బౌలింగ్‌ను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. గతంలో అతడిని షార్ట్ బాల్స్‌తో కొంత ఇబ్బంది పెట్టేవాళ్లం,. కానీ ఇప్పుడు వాటిని అలవోకగా సిక్సర్లుగా కొట్టేస్తున్నాడు.. కొద్ది రోజుల క్రితం వెస్టిండీస్ సిరీస్‌లోనూ వారిద్దరి విధ్వంసకర ఫామ్‌ను చూశాం, ఐపీఎల్‌లో రోహిత్ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు అని శాంట్నర్ వెల్లడించాడు.
న్యూజిలాండ్‌లోనూ సొంత టీ20 లీగ్ ఉండాలి:
అంతర్జాతీయ స్థాయిలో న్యూజిలాండ్ జట్టుకు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, దేశీవాళీ క్రికెట్‌కు మరింత ప్రచారం అవసరమని కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌లో సొంతంగా ఒక భారీ టీ20 లీగ్ ఉండాలి.. దీనివల్ల మన డొమెస్టిక్ ప్లేయర్లకు అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడే ఛాన్స్ లభిస్తుంది. వాస్తవానికి ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుతం 2027 చివరి వరకు వాయిదా పడినట్లు తెలిపాడు. టీ20 సిరీస్‌కు స్టేడియంలో మంచి స్పందన వచ్చిందని, రోహిత్-కోహ్లీలు వన్డేల్లోనే ఆడుతుంటడంతో.. ఈ సిరీస్‌కు కూడా ఫ్యాన్స్ భారీగా తరలివస్తారని శాంట్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
