ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ నియోజకవర్గం నుంచి భూపేష్ భఘేల్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగింపుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ పిటిషన్ విచారణకు అర్హమైనదా కాదా అనే అంశంపై విచారణ జరపాలన్న బఘేల్ విన్నపాన్ని ఛత్తీస్ గఢ్ హైకోర్టు తిరస్కరించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ బఘేల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ నియోజకవర్గం నుంచి భూపేష్ బఘేల్ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నికలో అక్రమాలు జరిగాయని, ఆయన విజయం చెల్లదని పేర్కొంటూ బీజేపీ నేత విజయ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని, దీనికి విచారణార్హత లేదని భూపేష్ బఘేల్ వాదించారు. ఈ అంశాన్ని ప్రాథమికాంశంగా పరిగణించి ముందుగా దీనిపైనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది.
హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలపై మాజీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. నిజానికి, సెప్టెంబర్ 28న కూడా భూపేష్ బఘేల్ దాఖలు చేసిన ఇటువంటి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విజయ్ బఘేల్ దాఖలు చేసిన అసలు పిటిషన్‌పై విచారణను అడ్డుకోలేమని గతంలోనే స్పష్టం చేసింది.
తాజా ఉత్తర్వులతో భూపేష్ బఘేల్ ఎన్నికపై హైకోర్టులో విచారణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. పటాన్ ఎన్నికల పిటిషన్‌పై దాఖలైన ఆధారాలు, వాదనలను హైకోర్టు ఇకపై యథాతథంగా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న భూపేష్ బఘేల్‌కు ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలకంగా మారింది. సెప్టెంబర్ నెలలో ఇచ్చిన ఆదేశాలనే సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించడంతో, ఈ వివాదంపై హైకోర్టులోనే తుది నిర్ణయం తేలాల్సి ఉంది.
