నిరసనల పేరుతో బహిరంగ ప్రదేశాలను, రహదారులను ఎక్కువ కాలం ఆక్రమించొద్దని సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్3) స్పష్టం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని వ్యాపారుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. నిరసన తెలిపే హక్కుతో పాటు ఇతరుల జీవనోపాధిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఏ ఒక్కరూ నిరసనల పేరుతో ఓ స్థలాన్ని ఎల్లకాలం ఆక్రమించలేరు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ అది ఒక నిర్దేశిత స్థలంలో, నిర్ణీత సమయం వరకు మాత్రమే జరగాలి" అని సీజేఐ అన్నారు. నిరసనలకు అనుమతి ఇచ్చేటప్పుడే షరతులను స్పష్టంగా పేర్కొనాలని అధికారులకు సూచించారు.
ఢిల్లీలో ఆందోళనల వల్ల వ్యాపార రంగం తీవ్రంగా నష్టపోతోందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసింది. నవంబర్ 1న రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన మెగా ర్యాలీతో ఒక్క రోజే రూ. 11వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఈ ఆందోళనల వల్ల సుమారు 2.5 లక్షల షాపులు మూతపడ్డాయని, దీని ప్రభావం రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లతో పాటు రవాణా, టూరిజం రంగాలపై పడిందని తెలిపింది. గడిచిన నెల రోజుల్లో మొత్తం రూ. 14వేల కోట్ల మేర బిజినెస్ నష్టపోయినట్లు సీటీఐ కోర్టుకు వివరించింది.
అక్టోబర్ 12న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతిని ఢిల్లీ పోలీసులు రద్దు చేసినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ర్యాలీలతో ఇబ్బందులు కొనసాగుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. నవంబర్ 11 వరకు ఎటువంటి ధర్నాలు, నిరసనలకు అనుమతి ఇవ్వొద్దని వ్యాపార సంఘం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది.
మరోవైపు, నిరసనల కవరేజీలో ఉన్న మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడుల అంశాన్ని సుప్రీంకోర్టు విడిగా విచారించనుంది. దీనిపై నవంబర్ 23న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మహిళలపై జరిగిన దాడుల విచారణ కోసం మహిళా జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ కోర్టును కోరారు. మహిళా పోలీస్ సిబ్బందిపై కూడా దాడులు జరిగినట్లు మరో న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
