* నవంబర్ 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ ఛాంపియన్షిప్*
* అండర్-15, అండర్-18 బాలికల విభాగాల్లో పోటీపడనున్న 17 జిల్లాలకు చెందిన 28 జట్లు*
హైదరాబాద్, నవంబర్ 3, 2026: తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ ఛాంపియన్‌షిప్‌ను నవంబర్ 4, 5 తేదీల్లో సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన వివరాలను ఈరోజు (2026, నవంబర్ 3, మంగళవారం) హైదరాబాద్ గచ్చిబౌలిలోని లైఫ్‌స్పాన్ హబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ మీటింగ్ లో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య వుత్పల పాల్గొని టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు.
17 జిల్లాల నుంచి 28 జట్లు:
* రెండు రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణలోని 17 జిల్లాలకు చెందిన మొత్తం 28 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో అండర్-15 విభాగంలో 16 జట్లు, అండర్-18 విభాగంలో 12 జట్లు పోటీ పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యువ క్రీడాకారిణులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఈ ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలవనుంది.
* అండర్-15 విభాగంలో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, వనపర్తి, జనగాం, వరంగల్, యాదాద్రి, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల జట్లు పాల్గొననున్నాయి.
* అండర్-18 విభాగంలో ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, వనపర్తి, జనగాం, వరంగల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల జట్లు పోటీ పడనున్నాయి.
అస్మిత అంటే మీనింగ్ ఇదే:
అస్మిత (ASMITA) అంటే ‘Achieving Sports Milestone by Inspiring Women Through Action’.. ఇది భారత ప్రభుత్వ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న కార్యక్రమం. మహిళలు, బాలికలను క్రీడల్లో ప్రోత్సహించడం, గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారిణులను గుర్తించడం దీని ప్రధాన లక్ష్యం.. జిల్లా స్థాయి పోటీల అనంతరం నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ తెలంగాణలో బాలికల రగ్బీ క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. ఈ పోటీల ద్వారా క్రీడాకారిణులకు మెరుగైన పోటీ అనుభవం లభించడంతో పాటు తమ నైపుణ్యాలను రాష్ట్రస్థాయిలో ప్రదర్శించే అవకాశం కలుగుతుంది.
బాలికలకు ఇదో మంచి ఛాన్స్.. డొంట్ మిస్:
తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే యువ బాలికలకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఈ ఛాంపియన్షిప్ ఒక గొప్ప అవకాశం. అస్మిత కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో రగ్బీ క్రీడను బలోపేతం చేయడంతో పాటు మరింత మంది బాలికలు ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నదే మా లక్ష్యం.. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, క్రీడా శాఖ అధికారులు, వోక్సెన్ యూనివర్సిటీ, జిల్లా నిర్వాహకులు, కోచ్‌లు, అధికారులు, భాగస్వాములందరికీ కృతజ్ఞతలు అని నంబుల తెలిపారు. కాగా తెలంగాణలో రగ్బీ క్రీడను మరింత విస్తరించేందుకు, పాఠశాలలు, జిల్లాల స్థాయి నిర్వాహకులు, కోచ్‌లు, ఇతర భాగస్వాములతో కలిసి మరిన్ని అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ రగ్బీ అసోసియేషన్ కృషి కొనసాగించనుందన్నారు.
కార్యక్రమ వివరాలు:
* కార్యక్రమం: రాష్ట్రస్థాయి అస్మిత రగ్బీ ఛాంపియన్షిప్ – 2026
* విభాగాలు: అండర్-15, అండర్-18 బాలికలు
* తేదీలు: నవంబర్ 4, 5, 2026
* వేదిక: వోక్సెన్ యూనివర్సిటీ, సంగారెడ్డి
* పాల్గొనే జట్లు: 17 జిల్లాల నుంచి మొత్తం 28 జట్లు
* అండర్-15: 16 జట్లు
* అండర్-18: 12 జట్లు
* నిర్వాహకులు: తెలంగాణ రగ్బీ అసోసియేషన్
