Virat Kohli: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త ప్రపంచ రికార్డుతో క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 186 పరుగుల లక్ష్య ఛేదనలో 3వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. వన్డే క్రికెట్ చరిత్రలోనే నెంబర్ 3 స్థానంలో 13,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు.
13 బంతుల్లోనే 13,000 పరుగుల రికార్డ్:
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నెంబర్ 3 స్థానంలో 13,000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 6.2 ఓవర్ దగ్గర (తను ఎదుర్కొన్న 13వ బంతికి) సింగిల్ తీసి విరాట్ ఈ మైలురాయిని అందుకోగానే గ్రౌండ్ అంతా చప్పట్లతో హోరెత్తిపోయింది. ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (12,662 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 10,000 కంటే ఎక్కువ రన్స్ చేసిన ఘనత కేవలం కోహ్లీ, పాంటింగ్‌లకు మాత్రమే సొంతం.
పాంటింగ్ అల్టిమేట్ రికార్డుపై కన్ను:
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రిక్కీ పాంటింగ్ (1,971 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 1,909 పరుగులతో* రెండో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో 75 పరుగులు సాధిస్తే పాంటింగ్‌ను వెనక్కి నెట్టి కివీస్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
మరో 47 రన్స్ చేస్తే కివీస్ గడ్డపై కింగ్ 1000:
న్యూజిలాండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 1,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్‌లో ఇంకా 47 రన్స్ అవసరం. ఇప్పటి వరకు టీమిండియా తరఫున కివీస్ గడ్డపై 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లుగా కేవలం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహమ్మద్ అజహరుద్దీన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల సరసన చేరేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడు.
