King 100 Tabu First Look: అదృష్టాన్ని ద్వేషించే పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా టబు.. నాగార్జున 'కింగ్ 100'లో అసలైన ఫైర్ ఇదే!

King 100 Tabu First Look: అదృష్టాన్ని ద్వేషించే పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా టబు.. నాగార్జున 'కింగ్ 100'లో అసలైన ఫైర్ ఇదే!

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా 'కింగ్ 100'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 4న తన 55వ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. టబు పోషిస్తున్న 'మహంతి ఝాన్సీ రాణి' పాత్ర పరిచయం చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ గ్లింప్స్‌లో టబు ఎంట్రీ చూస్తేనే పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. చీకటి రంగు చీరలో గంభీరమైన రాజకీయ నాయకురాలిగా కనిపించిన ఆమె, పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ తన అధికారాన్ని చాటుకున్నారు. డెస్క్‌పై ఉన్న నేమ్‌ప్లేట్ ద్వారా 'మహంతి ఝాన్సీ రాణి'గా ఆమె పాత్రను అధికారికంగా పరిచయం చేశారు. ఇక గ్లింప్స్ ప్రారంభంలోనే ఆమె చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచుతోంది.

"ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. నాకు అదృష్టమంటే అసహ్యం!" అంటూ టబు చెప్పిన డైలాగ్ ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, తెగువను స్పష్టంగా చూపిస్తోంది. మాటల్లోనే కాదు, చూపుల్లోనూ పవర్ చూపిస్తూ టబు తనదైన మార్క్‌ను మరోసారి చాటుకున్నారు.

 దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు జోడీ మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. గతంలో 'నిన్నే పెళ్లాడతా' వంటి చిత్రాల్లో రొమాంటిక్ జోడీగా ప్రేక్షకులను అలరించిన వీరిద్దరూ ఈసారి మాత్రం ప్రేమికులుగా కాకుండా ప్రత్యర్థులుగా కనిపించనున్నారు. 'ఈసారి ప్రేమ కాదు.. యుద్ధం' అంటూ గ్లింప్స్‌లో వచ్చిన టైటిల్ కార్డులు కథలో ఉండబోయే సంఘర్షణపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. టబు ప్రతినాయికగా నాగార్జునను ఎలా ఢీకొట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ : I'm Game OTT: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ థ్రిల్లర్..

మరో వైపు టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున ఆమె ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నిన్నే పెళ్లాడతా'లోని పండు పాత్రను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదని, ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణిగా ఆమె ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతారని పేర్కొంటూ టబుపై ప్రశంసలు కురిపించారు.

దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ చిత్రంతో బాక్సాఫీస్ పోటీని ఎదుర్కోనుంది. ఈ నాగార్జున, టబు మధ్య జరిగే పవర్ గేమ్ వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.