దీపావళి పండుగ సందర్భంగా ఓ కంపెనీ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి సప్రయిజ్ చేసింది. సాధారణంగా పండుగలకు కంపెనీలు స్వీట్లు, బట్టలు లేదా ఏదైనా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటాయి. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ, ఉద్యోగులకు ఐఫోన్లు బహుమతిగా ఇచ్చిన వీడియోను అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై అందంగా రిబ్బన్లు కట్టిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. దీపావళి పండుగ వేడుకల్లో భాగంగా కంపెనీ ఈ సర్ప్రైజ్ ఇచ్చింది.
ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేవు!
సుమారు 15 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఉద్యోగుల కంప్యూటర్ల ముందు తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తాయి. బహుమతులు చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా సంతోషంతో ఊగిపోయారు. ముఖ్యంగా కొందరు మహిళా ఉద్యోగులు వారికీ వచ్చిన గిఫ్టులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వీడియోను షేర్ చేస్తూ కంపెనీ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. "పోటీ లేదు.. మీకు ఎం గిఫ్ట్ వచ్చింది?" అంటూ పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు కంపెనీ ఇచ్చిన ఈ గిఫ్ట్స్ చూసి ప్రశంసిస్తున్నారు.
ఇది నిజమేనా ? AI వీడియోనా ?
ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. కొంతమంది ఇది నిజంగా జరిగిందేన అని అనుమానం వ్యక్తం చేశారు. మరికొందరైతే ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారు చేసి ఉంటారని కామెంట్లు పెట్టారు. అయితే ఈ అనుమానాలపై కంపెనీ స్పందించింది. ఇది ఏఐతో రూపొందించిన వీడియో కాదని స్పష్టం చేస్తూ... వీడియోను మరోసారి చూడాలని సరదాగా సమాధానం ఇచ్చింది.
కంపెనీపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!
ఈ గిఫ్ట్స్ వీడియో చూసిన నెటిజన్లు వారి స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. ఒకరు సరదాగా స్పందిస్తూ.. ఈ కంపెనీలో ఉద్యోగం చేయాలని ఉందని, ఏమైనా ఛాన్స్ ఉందా... అని అడిగారు.
మరో నెటిజన్ మాత్రం ఇలాంటి వీడియోలు చూస్తే అసూయ కలగకుండా ఉండాలంటే దీపావళి సమయంలో ఇన్స్టాగ్రామ్ వాడటం మానేయాలని కామెంట్ చేశారు.
ఇక మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు ఇచ్చి, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చారేమో అంటూ ఒకరు సరదాగా కామెంట్ చేసారు. మరొకరు "మా కంపెనీలో దీపావళికి కనీసం సోన్ పాప్డీ స్వీట్ బాక్స్ కూడా ఇవ్వలేదని సెటైర్ వేశారు.
మొత్తానికి, ఉద్యోగులకు ఐఫోన్ 16 ఫోన్లను దీపావళి కానుకగా ఇచ్చిన ఈ కంపెనీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యోగులను సంతోషపెట్టడానికి కంపెనీలు ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.
