24 గంటలు గడుస్తోంది.. ఏమైపోయారు మోదీజీ: రాహుల్ గాంధీ

24 గంటలు గడుస్తోంది.. ఏమైపోయారు మోదీజీ: రాహుల్ గాంధీ

విదేశీ శక్తుల కోసం ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు దేశ ద్రోహినో తేల్చేద్దాం రండి అంటూ ఓపెన్ డిబేట్ కు సవాల్ చేసిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి తన ఛాలెంజ్ ను గుర్తు చేశారు. నేను ఛాలెంజ్ చేసి 24 గంటలు గడుస్తోంది.. బహిరంగ చర్చకు రాలేదేంటి మోదీగారు.. అంటూ మరో ట్వీట్ చేశారు. 

2026 నవంబర్ 3న  ప్రధాని నరేంద్ర మోదీకి మళ్లీ ఓపెన్ డిబేట్ సవాలు విసిరారు రాహుల్. 24 గంటలు గడిచాయి మోదీ జీ. నేను మీకు సవాలు విసిరాను. మీరు ప్రతిపక్షం దేశద్రోహి అని అంటున్నారు. ఏ వేదికైనా, ఏ స్థలమైనా ఎంచుకోండి. నాతో డిబేట్ చేయండి. ఎవరు దేశద్రోహి? ఎవరికి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయి? ఆ సంబంధాలు ఎలాంటివి? తేల్చేద్దాం.. అని రాహుల్ గాంధీ ఎక్స్‌ లో వీడియో పోస్ట్ చేశారు.  వీలైనంత త్వరగా డిబేట్ చేద్దాం.. భయపడకండి అని కూడా చెప్పారు.

డిబేట్ మీడియా, యువత సమక్షంలో జరగాలని రాహుల్ గాంధీ  కోరారు. మోదీ ఎవరినైనా మోడరేటర్‌గా ఎంచుకోవచ్చని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కూడా నియమించవచ్చని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నిర్మాణం, అమెరికాతో ఒప్పందం ఎలా జరిగింది, ఎందుకు తొందరగా, కేబినెట్‌కు ఎందుకు తెలియజేయలేదు, అదానీ కేసు ఎందుకు మూసివేశారు, ఎప్‌స్టీన్ వంటి అంశాలపై చర్చించాలని అన్నారు. తనపై 45 దాకా దూషణ కేసులు ఉన్నాయని, కానీ విదేశీ సంబంధాలపై చేసిన వ్యాఖ్యలపై ఏ కేసు లేదని చెప్పి, కావాలంటే దావా వేయమని సవాలు విసిరారు. వీడియో చివర దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

యువతకు పోల్

భారత యువతా, రాహుల్ గాంధీ vs నరేంద్ర మోదీ ఓపెన్ డిబేట్ చూడాలనుకుంటున్నారా? అని అడిగి, ఆప్షన్లు Yes – మోదీ జీ, డరో మత్,  No - మోదీ జీ, డర్ గయే.. ఆప్షన్లు  ఇచ్చారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్‌లను ట్యాగ్ చేసి మోదీని ఒప్పించమని కోరారు.

ఈ సవాలుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఛత్తీస్‌గఢ్ రాజ్యోత్సవం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చకు సిద్ధమని చెప్పారు. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్), ఈవీఎంలు, చొరబాటుదారుల అంశాలపై ప్రత్యేక సమావేశం పిలిచి చర్చించడానికి సిద్ధమని షా సవాలు విసిరారు. హైదరాబాద్ నుంచి సవాలు విసురుతున్నాను. ప్రత్యేక సమావేశం పిలుస్తాం. డిబేట్‌కు రండి అన్నారు.  

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిబేట్‌కు సిద్ధమని సవాలు విసిరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు రాహుల్ గాంధీని విమర్శిస్తూ, భారత శత్రువుల అజెండాలను ముందుకు తీసుకెళ్లి ఇతరులపై విదేశీ మద్దతు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 

 అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా మోదీ ప్రతిపక్షాన్ని  దేశాన్ని విభజించే శక్తులు, సోషల్ మీడియా ద్వారా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దీనికి స్పందిస్తూ సోమవారం రాహుల్ గాంధీ మోదీ విదేశీ సహాయంతో ప్రధాని అయ్యారని, అలాగే కొనసాగుతున్నారని ఆరోపించి ఓపెన్ డిబేట్ సవాలు విసిరారు.