ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం: మాజీ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో షాకింగ్ విషయాలు!

ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం: మాజీ ఐటీ ఉద్యోగిని మృతి కేసులో షాకింగ్ విషయాలు!

పెండ్లి సమయంలో కట్నం గట్టిగనే గుంజిర్రు. అది సాల్తలేదని ఏటేటా తల్లి గారి ఇంటికాన్నుంచి కానుకలు తేవాలని ఒత్తిడి చేస్తున్నరు. కొన్నొద్దులు అట్లనే తెచ్చింది. కానీ ఎన్ని దినాలని భరిస్తది. తల్లిగారిది వ్యవసాయ కుటుంబం. ఏటా పది తులాలు అంటే ఎక్కణ్నుంచి తెచ్చేది. అత్తింటి వేధింపులకు తట్టుకోలేక ఫ్యానుకు ఉరేసుకుని సచ్చిపోయింది పాపం. అయితే అత్తింటి వారు హత్య చేశారని ఆరోపిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

వివరాల్లోకి వెళ్తే.. పుణెకు చెందిన ఓ మాజీ IT ఉద్యోగిని మృతదేహం ఫ్లాట్‌లో వేలాడుతూ దొరికింది. మృతురాలి కుటుంబం హత్య జరిగిందని ఆరోపిస్తుండగా, భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులో  భర్తను పోలీసులు  అరెస్ట్ చేశారు.

మృతురాలి పేరు పాయల్ జాంబ్రే పాటిల్ (34). ఆమె గతంలో IT కంపెనీలో పని చేసి తర్వాత ఉద్యోగం మానేశారని పోలీసులు తెలిపారు.   భర్త క్షయ్ జాంబ్రే పాటిల్‌ తో కలిసి పుణేలో నివాసముంటున్నారు.  ఒక కూతురు కూడా ఉంది.

2026 నవంబర్ 1 ( ఆదివారం)  అత్త తో గొడవ జరిగిన తర్వాత పాయల్ ఇల్లు వదిలి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం అందరూ ఆమె కోసం వెతికిన క్రమంలో..  ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. సూసైడ్ నోట్ ఏదీ దొరకలేదని స్వర్గేట్ పోలీస్ స్టేషన్ అధికారి కి తెలిపారు.

పాయల్ సోదరుడు రుషికేశ్ పవార్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం పాయల్ అత్త, మామ , భర్త ముగ్గురూ ఏమీ పట్టనట్టు కూర్చున్నారని, తాను అడిగిన తర్వాతే లేచి వెతకడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఐదు నిమిషాల్లోనే తిరిగొచ్చి దగ్గర్లోని అపార్ట్‌మెంట్‌లో ఉందని చెప్పారని, తాను వెళ్లి బాల్కనీ గుండా లోపలికి దూరి చూస్తే పాయల్ వేలాడుతున్నారని అన్నారు.

పాయల్ మేనమామ ఆమె హత్యకు గురైందని, భర్త, అత్తమామలు శవాన్ని వేలాడదీశారని ఆరోపించారు. పెళ్లయిన నాటి నుంచీ అత్త వేధింపులు పెట్టింది. ప్రతి దీపావళికి 10 తులాల బంగారం అడిగేవారు. ఈ ఏడాది కూడా అదే డిమాండ్ వచ్చింది. మేం రైతులం, కరువు పరిస్థితుల్లో ఉన్నాం, వచ్చే ఏడాది ఇస్తామని చెప్పాం.. అయినా కూడా టార్చర్ చేశారని అని ఆయన ఆరోపించారు.

పోలీస్ కంప్లైంట్ ప్రకారం, 2022లో పాయల్ గర్భంలో ఉన్నప్పుడు మగ బిడ్డనివ్వాలని భర్త, అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. 2023 మార్చి 30న ఆడపిల్ల పుట్టిన తర్వాత అత్తమామలు ఆసుపత్రికొచ్చి గొడవ చేసి, తమకు సంబంధం లేదని, పాయల్, ఆమె పాప బాధ్యత తాము తీసుకోలేమని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్వర్గేట్ సీనియర్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ నికమ్ మాట్లాడుతూ అక్షయ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అత్త, మామలను పట్టుకోవడానికి రెండు పోలీస్ టీమ్‌లు వెతుకుతున్నాయని చెప్పారు. పాయల్ మృతిపై  ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదైంది. అయితే ఆమె కుటుంబం ఇది హత్యేనని ఆరోపిస్తోంది. పాయల్ ను చంపేసి  ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.  అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.