ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. జనసేన రెబల్ స్వప్న నాయకర్ ఘన విజయం

ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్.. జనసేన రెబల్ స్వప్న నాయకర్ ఘన విజయం

కర్నూలు: ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వప్న మల్లప్ప నాయకర్ విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని దక్కించుకున్నారు. సుమారు 2,054 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

జనసేనకు దక్కని అవకాశం.. స్వతంత్రంగా బరిలోకి స్వప్న

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం జనసేనకు దక్కుతుందని ఆ పార్టీ నాయకులు ఆశించారు. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున నాగమణి పేరు ఖరారైంది. దీంతో జనసేనలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన ఆదోని ఇన్‌చార్జి మల్లప్ప నాయకర్ తన సతీమణి స్వప్నను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు.

కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఏర్పడిన విభేదాలు ఈ ఎన్నికలో ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వప్నకు జనసేన మద్దతుదారులతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఓటర్లు కూడా మద్దతు ఇచ్చారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. క్రాస్ ఓటింగ్ జరిగిందన్న చర్చ కూడా వినిపిస్తోంది. 

జనసేనకు కేటాయిస్తారని భావించిన చైర్‌పర్సన్ స్థానం చివరకు టీడీపీకి వెళ్లడం, ఆ తర్వాత జనసేన నేత మల్లప్ప నాయకర్ సతీమణి స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు.  ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.