Jesús de Miguel: స్పానిష్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రత్యర్థి గోల్‌కీపర్‌తో బంతి కోసం జరిగిన ఘర్షణలో సీడీ టెనెరిఫ్ (CD Tenerife) క్లబ్ స్టార్ స్ట్రైకర్ జెసస్ డి మిగ్యుయెల్ (Jesús de Miguel) అక్కడిక్కడే కుప్పకూలాడు. ఈ సంఘటనలో ఎఫ్‌సీ అండోరా (FC Andorra) గోల్‌కీపర్ జెసస్ ఒవోనో (Jesús Owono) కి రెఫరీ రెడ్ కార్డ్ జారీ చేశాడు.
ఇంతకీ గ్రౌండ్‌లో ఏం జరిగిందంటే?:
మ్యాచ్ జరిగే సమయంలో కౌంటర్ ఎటాక్ కోసం లాంగ్ బాల్‌తో వస్తున్న బంతిని అడ్డుకునేందుకు ఎఫ్‌సీ అండోరా గోల్‌కీపర్ జెసస్ ఒవోనో పోస్ట్ దాటి ముందుకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో బంతిని అందుకునే ప్రయత్నంలో ఒవోనో మోకాలు పైకి ఎత్తడంతో, ఒక్కసారిగా ముందుకు వచ్చిన స్ట్రైకర్ డి మిగ్యుయెల్‌కి ఒవోనో మోకాలు బలంగా తాకింది. దెబ్బ గట్టిగానే తాకడంతో డి మిగ్యుయెల్ గ్రౌండ్‌లోనే కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు)కి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఈరోజు ( 2026, నవంబర్ 3, మంగళవారం) తుదిశ్వాస విడిచాడు.
ఎవరీ జెసస్ ఒవోనో (Jesús Owono)?:
ఈ ప్రమాదానికి కారణమైన జెసస్ ఒవోనో ఎక్వటోరియల్ గినియా దేశానికి చెందిన 25 ఏళ్ల ప్రొఫెషనల్ గోల్‌కీపర్.. స్పెయిన్‌లోని డెపోర్టివో అలవెస్ యూత్ అకాడమీ ద్వారా కెరీర్ ప్రారంభించి 2022లో మెయిన్ టీమ్‌లోకి వచ్చాడు. లోన్ ప్రాతిపదికన ఎఫ్‌సీ అండోరాకు ఆడిన ఒవోనో, ఆగస్టు 2026లో ఆ క్లబ్‌తో శాశ్వత కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. 2019 నుంచి ఎక్వటోరియల్ గినియా జాతీయ జట్టుకు ప్రాతిపద్యం వహిస్తూ రెండు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (AFCON) టోర్నమెంట్లలో ఆడాడు.
ఒవోనోకు ఎలాంటి శిక్ష పడే ఛాన్స్?:
* ఫుట్‌బాల్ బ్యాన్ (Suspension): రాయల్ స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ డిసిప్లినరీ కోడ్ ఆర్టికల్ 102 ప్రకారం ఒవోనోపై 4 నుంచి 12 మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. డిసిప్లినరీ కమిటీ సమీక్ష ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
* క్రిమినల్ కేసు, జైలు శిక్ష (Criminal Charges): క్రీడాకారుడు మైదానంలోనే మరణించడంతో స్పెయిన్ చట్టాల ప్రకారం ఒవోనోపై తీవ్రమైన క్రిమినల్ విచారణ జరిగే ఛాన్స్ ఉంది. స్పెయిన్ క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 142 ప్రకారం, తీవ్ర నిర్లక్ష్యం (Gross Negligence) కారణంగా మరణానికి కారణమైతే ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా రూల్స్ ఉన్నాయి.
* ఒకవేళ నిర్లక్ష్యం తీవ్రత తక్కువగా పరిగణించబడితే భారీ ఫైన్ తో సరిపెడతారు. ప్రస్తుతం ఈ దురదృష్టకర సంఘటన తర్వాత ఒవోనో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ డిసేబుల్ చేసుకున్నాడు. ఈ సంఘటనపై అతను ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
🔵⚪️ | Golpe fortísimo de Owono sobre Jesús de Miguel que hace que salten todas las alarmas. 🇪🇸👀 🙏🏼 Pronta recuperación a Jesús y que todo quede en un susto 🏟️ Tenerife - Andorra https://t.co/NXopIJ7p9H
— Laliga News (@laligaa_neews) November 2, 2026
