రీకౌంటింగ్‌లోనూ టై.. లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి విజయం

రీకౌంటింగ్‌లోనూ టై.. లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి విజయం

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 35వ వార్డు ఫలితం ఉత్కంఠ రేపింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో విజేతను నిర్ణయించేందుకు అధికారులు లక్కీ డ్రా నిర్వహించాల్సి వచ్చింది.

ఈ వార్డులో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపులో ఇద్దరికీ 340 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో ఎవరు విజయం సాధించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇరువురికీ మళ్లీ సమానంగా ఓట్లు రావడంతో చివరకు లక్కీ డ్రా నిర్వహించారు.

ఈ డ్రాలో వైసీపీ అభ్యర్థి మార్పు అరుణ విజయం సాధించారు. దీంతో 340 ఓట్లతో సమానంగా నిలిచిన ఇద్దరు అభ్యర్థుల్లో అదృష్టం అరుణను వరించింది. ఉత్కంఠభరితంగా సాగిన 35వ వార్డు కౌంటింగ్‌కు లక్కీ డ్రాతో తెరపడింది.

ఓట్ల లెక్కింపులో టై కావడం, రీకౌంటింగ్‌లోనూ అదే ఫలితం రావడం, చివరకు లాటరీ ద్వారా విజేతను ప్రకటించడం పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.