హైదరాబాద్: తుమ్మిడిహట్టితో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ముంపు సర్వేకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సర్వేకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పురోగతికి అవసరమైన అన్ని అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గతంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర అధికారులకు అందించాలని ఆదేశించారు.
అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపై మహారాష్ట్ర అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో చర్చలను కొనసాగిస్తూ తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ముందడుగు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
