Sandeep Reddy: ఫెయిల్యూర్ నటులు, దర్శకులపై సందీప్ రెడ్డి వంగా ఫైర్.. అసలు ఏమైందంటే?

Sandeep Reddy: ఫెయిల్యూర్ నటులు, దర్శకులపై సందీప్ రెడ్డి వంగా ఫైర్.. అసలు ఏమైందంటే?

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా రాప్తాడులో పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.15 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు చైన్ సాతో విరుచుకుపడ్డాడు. అది కూడా తోటి విద్యార్థుల ముందే అత్యంత దారుణంగా దాడికి దిగడం అందరినీ వణికించింది. అయితే, ఈ అమానుషాన్ని ఖండించాల్సిన కొందరు.. ఇలాంటి దారుణాలకు 'సినిమాల్లోని హింసే దీనికి కారణం' అంటూ విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన సినిమాలను టార్గెట్ చేయడం సోషల్ మీడియాను ఊపేసింది.

ఈ విమర్శలపై సందీప్ రెడ్డి వంగా సైతం అంతే ఘాటుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లతో విరుచుకుపడ్డారు. "ఇలాంటి ఘోరం జరిగినప్పుడు ముందు బాధితురాలి పట్ల సానుభూతి చూపాలి. అసలు నేరానికి గల మానసిక, సామాజిక కారణాలను విశ్లేషించాలి. అంతే తప్ప ప్రతీదానికీ సినిమాలను బలిపశువు చేయడం ఏంటి? అంటూ నిలదీశారు.

అంతటితో ఆగకుండా ఇండస్ట్రీలోని కొందరు నటులు, నిర్మాతలు, ఫెయిల్యూర్‌ దర్శకులపై సందీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొందరు సొంత కక్షలు తీర్చుకోవడానికి ఈ దుర్ఘటనను ఒక మురికి అవకాశంగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద సమాజ సేవకుల్లా బిల్డప్ ఇస్తూ ఇతరులపై పడటం మీ అవకాశవాదానికి నిదర్శనం" అని మండిపడ్డారు . ఒక విషాదం కోరుకునేది కేవలం సానుభూతి మాత్రమే.. మీ అవకాశవాదాన్ని కాదు  అని తేల్చిచెప్పారు.

అయితే సందీప్ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.  సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కొందరు వాదిస్తుంటే.. వ్యక్తిగత మానసిక వైకల్యాలకు సినిమాలను బ్లేమ్ చేయడం సరికాదని మరికొందరు సందీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇతర సినీ ప్రముఖుల స్పందనలతో మరింత ముదురుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది..