నల్గొండ జిల్లాలో మూకుమ్మడిగా సెలవులు కోరిన పంచాయతీ కార్యదర్శులు

నల్గొండ జిల్లాలో మూకుమ్మడిగా సెలవులు కోరిన పంచాయతీ కార్యదర్శులు

నల్లగొండ జిల్లా  మర్రిగూడ మండలంలో  మూకుమ్మడిగా సెలవు కోరుతూ  ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు పంచాయతీ కార్యదర్శులు. మర్రిగూడ మండలంలోని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టి 2026 నవంబర్ 4న నిరసన వ్యక్తం చేశారు. 

అధికారుల వేధింపులు, పని ఒత్తిళ్లు తట్టుకోలేక విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. గత కొంతకాలంగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు.

సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదని స్పష్టం చేశారు. దీంతో  డీపీఓ తరుణ్ చక్రవర్తి మర్రిగూడ మండలంలో విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వారి సమస్యలు, అధికారుల ఒత్తిళ్లు, వేధింపులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. వారి సమస్యలను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో   కార్యదర్శులు యథావిధిగా  ఈరోజు విధుల్లో చేరారు.