సదర్ సమ్మేళనం అంటే యాదవుల పండుగ మాత్రమే కాదని.. తెలంగాణ ఆత్మగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు . 2026 నవంబర్ 4న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సదర్ సమ్మేళనంలో చీఫ్ గెస్టుగా పాల్గొన్న సీఎం.. యాదవులందరికీ సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సదర్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు.
యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సదర్ సమ్మేళనాన్ని తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సదర్ ను రాష్ట్ర పండుగగా గుర్తించినట్లు చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు. గోల్కొండ కోట గతంలో కొల్లకొండ కోట అని గుర్తు చేశారు. గోల్కొండ కోట, కాకతీయ రాజవంశం కాలం నాటి నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో యాదవ రాజులు, యాదవ సోదరుల కృషి మరవరానిదని కొనియాడారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరినీ యాదవ సోదరులు కలుపుకొని పోయారని అన్నారు.
కాలేజీ రోజుల నుంచే దీపావళి సమయంలో సదర్ వేడుకల వైభవాన్ని చూస్తున్నానని.. ఇది నగరానికి ఎంతో శోభనిస్తుందని కొనియాడారు. తేజస్వి యాదవ్, ధర్మేంద్ర యాదవ్, ఇతర నేతలకు కార్యక్రమం దిగ్విజయం చేసిన స్థానిక యాదవ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
