అగ్నిపథ్ పథకం కింద భారత సాయుధ దళాల్లో నియమితులైన అగ్నివీరులకు సర్వీస్ కాలాన్ని మరో రెండేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణియం ఓ ప్రకటన చేశారు. అగ్నివీర్లలో 25 శాతం మంది తమ తొలి నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత రెగ్యులర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి చేరతారని, మిగిలిన 75 శాతానికి అదనంగా మరో రెండేళ్ల నియామక కాలం ఇవ్వనున్నట్లు సీడీఎస్ తెలిపారు.
మీడియాతో మాట్లాడిన సీడీఎస్ జనరల్ సుబ్రమణియం.. పొడిగించిన రెండేళ్ల గడువు పూర్తయిన తర్వాత కూడా అగ్నివీరులకు రెగ్యులర్ సైనికులుగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఇందుకు వారి పనితీరు, వ్యక్తిగత ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సైన్యం, నావికాదళం, వైమానిక దళాల్లో యువతను అగ్నివీరులుగా నియమిస్తున్నారు. ఆరు నెలల శిక్షణతో కలిపి నాలుగేళ్ల సర్వీస్ ఈ పథకంలో భాగంగా ఉంటుంది.
మొదటి విడతలో సుమారు 24వేల400 మంది అగ్నివీరులు మూడు దళాల్లో చేరారు. పాత నిబంధనల ప్రకారం వీరిలో దాదాపు 18వేల300 మంది నాలుగేళ్ల తర్వాత సర్వీస్ నుంచి విడుదల కావాల్సి ఉంది. తాజాగా ప్రతిపాదించిన రెండేళ్ల పొడిగింపు అమలైతే వారికి అదనపు ఉద్యోగావకాశం, సాయుధ దళాల్లో కొనసాగేందుకు మరింత సమయం లభించనుంది.
అయితే అగ్నివీరులకు పెన్షన్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు వర్తించవన్న ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉంటాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
►ALSO READ | వ్యాపార, ఉద్యోగాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేకపోతున్న మహిళలు.. పాక్, బంగ్లా కంటే ముందే భారత్!
