కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తే ఇక అంతే..కేరళ సర్కార్ కొత్త ప్లాన్.. విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ !

కాలేజీల్లో ర్యాగింగ్ చేస్తే ఇక అంతే..కేరళ సర్కార్ కొత్త ప్లాన్.. విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్ !

విద్యార్థుల భద్రతతో పాటు యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 300 సైన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు, ఇతర సమస్యలపై విద్యార్థులు వారి  పేరు బయటపెట్టకుండా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను  కూడా తీసుకురానుంది. ఈ రెండు కార్యక్రమాలను ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ బుధవారం తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రారంభించనున్నారు.

15 లక్షల మంది యువతే లక్ష్యం
కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ సైన్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలపై ఆసక్తి, మానవతా విలువలను పెంచడం దీని ముఖ్య లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 15 లక్షల మంది యువతకు ఈ కార్యక్రమాన్ని చేరువ చేయనున్నారు.

ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం ఆన్‌లైన్ కోర్సులు, హ్యాండ్‌బుక్‌లు, చిన్న చిన్న ఎడ్యుకేషన్  వీడియోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీ-డిట్ (C-DIT) సహకారంతో రూపొందించిన ప్రత్యేక ఆన్‌లైన్ కోర్సును కూడా ప్రారంభించనున్నారు.

విద్యార్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్
కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు, ఇతర సమస్యలను ఎదుర్కొనే విద్యార్థులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం 'సిద్ధార్థ్ స్టూడెంట్ వెల్ఫేర్ యాప్'ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు వాళ్ళ పేరు, వివరాలు బయటపెట్టకుండానే ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు.. వారి సమస్యలను ఆడియో రూపంలో కూడా రికార్డ్ చేసి పంపే సదుపాయం ఉంటుంది. క్యాంపస్‌లో భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు కూడా సమాచారం ఇవ్వొచ్చు.

సిద్ధార్థ్ పేరుతో యాప్
ఈ యాప్‌కు వయనాడ్‌లోని పూకోడ్ వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి జె.ఎస్. సిద్ధార్థ్ పేరు పెట్టారు. 2024 ఫిబ్రవరిలో తోటి విద్యార్థుల వేధింపుల నేపథ్యంలో సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

►ALSO READ | 4 ఏళ్ల జీతాన్ని దీపావళి బోనస్ గా ఇస్తున్నారా : మైక్రాన్ ఐటీ కంపెనీ వార్తల్లో నిజమెంత..?

ఇదిలా ఉంటే, రాష్ట్రంలో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ర్యాగింగ్ ఘటనలను అడ్డుకోవడంతో పాటు, వాటిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ప్రతిపాదన ఉద్దేశం. అలాగే రాష్ట్ర స్థాయిలో ర్యాగింగ్ నిరోధక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తోంది.

విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్వే
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలు, ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకునేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేక సర్వేను కూడా ప్రారంభించనుంది. మొత్తంగా చూస్తే.. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంచడం, కాలేజీల్లో ర్యాగింగ్‌ను అరికట్టడం, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలను చేపడుతోంది.