ఏపీ లిక్కర్ రవాణా కేసులో.. ఈడీ విచారణకు మాజీ మంత్రి అంబటి

ఏపీ లిక్కర్ రవాణా కేసులో.. ఈడీ విచారణకు మాజీ  మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కేసులో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో అనారోగ్య కారణాల వల్ల గైర్హాజరైన అంబటికి ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు నవంబర్ 4, 2026న విచారణకు హాజరయ్యారు. 

రూ. 250 కోట్ల విలువైన ఏపీ మద్యం రవాణా టెండర్ల అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు అంబటి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే గతంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనను విచారించారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈడీ అధికారులకు తన ఆధార్, పాన్ కార్డులతో పాటు వ్యక్తిగత వివరాలను అందజేసినట్లు వెల్లడించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా పూర్తిస్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు.

తన నియోజకవర్గానికి చెందిన అనుచరులు మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంకు లిక్కర్ రవాణా కాంట్రాక్టుల్లో సబ్ కాంట్రాక్టులు ఇప్పించేందుకు వాసుదేవరెడ్డితో మాట్లాడినట్లు అంబటి రాంబాబు చెప్పారు. వారు తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు కావడంతో సబ్ కాంట్రాక్టులు ఇప్పించానని తెలిపారు. అయితే ఈ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై కూడా అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో ఎన్నికలు జరగకుండా కూటమి కుట్ర చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహించలేదని, పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతలపై దాడులు జరిగాయని విమర్శించారు.