హైదరాబాద్ చైతన్యపురిలో రాత్రికి రాత్రే 4 బస్‌‌‌‌ షెల్టర్లు మాయం !

హైదరాబాద్ చైతన్యపురిలో రాత్రికి రాత్రే 4 బస్‌‌‌‌ షెల్టర్లు మాయం !
  • తెల్లారి వచ్చిన ప్యాసింజర్లకు షాక్​ 
  • కొద్దిదూరంలో ప్రత్యక్ష్యం
  • షాపులకు అడ్డుగా ఉన్నాయనే ఫిర్యాదు చేశాం : ఎంఎంసీ 
  • కంప్లయింట్ రాలేదు: పోలీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చైతన్యపురిలో వారం రోజుల కింద రాత్రికి రాత్రే నాలుగు బస్‌‌‌‌ షెల్టర్లు మాయమయ్యాయి. మరుసటి రోజు బస్ స్టాప్ కి వచ్చిన ప్రయాణికులకు షెల్టర్లు కనిపించకపోవడంతో పరేషాన్ అయ్యారు. కొద్దిసేపయ్యాక సుమారు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసినట్టు తెలుసుకుని అవాక్కయ్యారు.

ఆ బస్​షెల్టర్లు కొన్ని దుకాణాలకు అడ్డొస్తున్నందునే రాత్రికి రాత్రే ఆఘమేఘాల మీద మరో చోటికి షిఫ్ట్​ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్‌‌‌‌ షెల్టర్లను ఎవరు మార్చారో  తమకు తెలియదని యాడ్‌‌‌‌ ఏజెన్సీ ప్రతినిధులు, ఎంఎంసీ అధికారులు చెప్తున్నారు.

యాడ్ ఏజెన్సీ.. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పబ్లిక్ ​ప్రాపర్టీ కావడంతో ఎంఎంసీ లేదా ఆర్టీసీ ఆఫీసర్లు ఫిర్యాదు చేస్తేనే స్వీకరిస్తామని సీఐ చెప్పినట్టు తెలిసింది. మరోవైపు ఎంఎంసీ ఆఫీసర్​ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తుండగా, ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులంటున్నారు. ఆర్టీసీ అధికారులేమో తాము షిఫ్టింగ్​కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫైనల్​గా ఇందులో ఎంఎంసీ సిబ్బందితో పాటు అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దుకాణాలకు అడ్డుగా ఉన్నాయనేనా ?
బస్ షెల్టర్ షిఫ్ట్ చేయాలంటే ఆర్టీసీ, ఎంఎంసీ అధికారులతో పాటు పోలీసులు సంయుక్తంగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, చైతన్యపురిలో ఆ రూల్స్ ​ఏమీ పాటించినట్టు కనిపించడం లేదు. పైగా, బస్​షెల్టర్లను ఒకచోటు నుంచి మరో చోటికి తరలిస్తే వాటి మార్పునకు సంబంధించిన కారణాలు, అనుమతులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ముందే పేపర్ ​ప్రకటన ఇవ్వడమో..లేక బస్టాప్ ​వద్ద బోర్డు లాంటిది ఏర్పాటు చేయాలి. కానీ, ఇక్కడ అవేవీ పాటించలేదు.