న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 451గా నమోదైంది.దీంతో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు రెండో దశ ఆంక్షలను అధికారులు అమల్లోకి తెచ్చారు. దీపావళి వేళ పటాకుల వినియోగం పెరిగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పటాకుల విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది.
న్యాయస్థానం ఆంక్షలు విధించినప్పటికీ ఢిల్లీ మార్కెట్లలో గ్రీన్ క్రాకర్స్ తోపాటు అన్ని రకాల పటాకులు యథేచ్ఛగా అమ్ముతున్నట్లు వచ్చిన వార్తా కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఆంక్షలు పక్కాగా అమలయ్యేలా చూడాలని అదనపు సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.
