- 21,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ముంబై: పుణెలో రూ.8,300 కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో లైన్–-3 (పింక్ లైన్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు 23కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్రాజెక్టును మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. దీంతోపాటు మొత్తం రూ.21,800 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు మెట్రో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పింక్ లైన్ కారిడార్ మాన్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు విస్తరించి ఉంది.
ప్రముఖ ఐటీ హబ్ అయిన హింజేవాడీని శివాజీనగర్‌తో అనుసంధానించడం ద్వారా వేలాది మంది ఐటీ నిపుణులు, రోజువారీ ప్రయాణికులకు రవాణా కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. ఈ లైన్ అందుబాటులోకి రావడం వల్ల సొంత వాహనాల వాడకం తగ్గి, సిటీలో ట్రాఫిక్ రద్దీతో పాటు వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
13,500 కోట్లతో ఫేజ్-2కు శంకుస్థాపన
పుణె సిటీ రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో ఫేజ్–2కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ఫేజ్–2లో 2ఏ, 2బీ, 4, 4ఏ లైన్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 12.75 కిలోమీటర్ల పొడవు ఉన్న లైన్ 2ఏ వనజ్ నుంచి చాందిని చౌక్‌ను, లైన్ 2బీ రామ్వాడీ నుంచి విఠల్వాడీని కలుపుతాయి. అలాగే 25.52 కిలోమీటర్ల పొడవైన లైన్–4ను ఖరాడీ నుంచి ఖడక్వాస్లా మధ్య, 6.12 కిలోమీటర్ల పొడవైన లైన్ 4ఏను నల్ స్టాప్ నుంచి మాణిక్ బాగ్ మధ్య నిర్మించనున్నారు.
ఈ కొత్త కారిడార్ల నిర్మాణం వల్ల ఖరాడీ, మగర్‌పట్టా, హడప్సర్, స్వర్ గేట్, మాణిక్ బాగ్, నాందేడ్ సిటీ, పుణె కంటోన్మెంట్, వార్జే వంటి ప్రధాన ప్రాంతాలకు మెట్రో సదుపాయం లభించనుంది. అంతేకాకుండా స్వర్ గేట్, నల్ స్టాప్, ఖరాడీ బైపాస్ వద్ద మల్టీమోడల్ ఇంటర్చేంజ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, ఇంటర్ సిటీ బస్సులు, ఇతర మెట్రో లైన్లకు అత్యంత సులువుగా మారే వెసులుబాటు కలుగుతుంది.
