నిర్మాతగా విభిన్నమైన కథలతో ఆకట్టుకున్న నిహారిక కొణిదెల.. రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరితో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా నటిస్తున్నారు. ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 11న సినిమా విడుదల కానుంది. మంగళవారం టీజర్‌ను రిలీజ్ చేశారు. విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగే ఓ యువకుడు.. తన కలను నెరవేర్చుకోవడానికి గ్యాంబ్లింగ్ మార్గాన్ని ఎంచుకుంటాడు.
అయితే, ఆ నిర్ణయం అతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? ఆ ప్రయాణంలో ఎదురైన పరిణామాలు ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్‌ను కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో చాలా ఫాస్ట్‌గా తీసిన సినిమా ఇది. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది’అని చెప్పాడు. నిహారిక మాట్లాడుతూ ‘టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా.
ఈ సినిమా కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని చెప్పారు. గ్యాంబ్లింగ్ కథతో వస్తోన్న ఈ మూవీ చాలా ఇంటరెస్టింగ్‌గా సాగుతుందని దర్శకుడు రుద్ర అత్రి చెప్పాడు. తాను పోషించిన హారిక పాత్రను అందరూ ప్రేమిస్తారు. ద్వేషిస్తారు. అలాగే ఫీలవుతారని నటి శ్రియా కొంతం చెప్పింది. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాథ వర్మ, నిర్మల్, మ్యూజికల్ డైరెక్టర్ గ్యానీ పాల్గొన్నారు.
